• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిరణ్ కుమార్ రెడ్డి దూకుడుకు చెక్

By Srinivas
|

Kiran Kumar Reddy
రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకూ పెరుగుతున్న అగాథాన్ని పూడ్చేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. చెరోదారిలో వెళ్తున్న జోడెద్దులను కలిపి ఉంచే కాడిని కనిపెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమించింది. ఏర్పడీ ఏర్పడక ముందే ఈ కమిటీ ముఖ్యమంత్రి కిరణ్ దూకుడుకు బ్రేకులు వేసేలా ఉందనే వాదన అప్పుడే మొదలైంది. ముఖ్యమంత్రి కిరణ్ ఒకవైపు, పిసిసి సారథి బొత్స సత్యనారాయణ మరోవైపు. శాఖల కేటాయింపుతోనే ఇద్దరి మధ్య అంతరం పొడచూపింది. అది అంతకంతకు పెరుగుతూ ముఖ్యమంత్రి పథకాలను, నిర్ణయాలను నిలదీసేదాకా వెళ్లింది. కిరణ్ తీరుపై పార్టీలోని పలువురు నేతల్లోనూ ఇదే అసంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య లోపిస్తున్న సమన్వయం వల్ల అంతిమంగా కాంగ్రెస్ దెబ్బతింటున్నట్లు అధిష్ఠానం ఆందోళన చెంది సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.

శాఖల కేటాయింపుపై అసంతృప్తి నుంచి తాజాగా జగన్ వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వరకూ జరుగుతున్న పరిణామాలన్నింటిని హైకమాండ్ నిశితంగా పరిశీలించింది. ఇటీవల కిరణ్, బొత్స పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఇక జాప్యం చేయడం ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చి గురువారం ఈ కమిటీని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ తర్వాత సోనియా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ను పిలిచి చర్చించారు. సాయంత్రానికే కమిటీ ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ఇటీవల మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులు జరగడం, బొత్సను టార్గెట్ చేసుకునే ఈ దాడులు జరిపించినట్లు వార్తలు రావడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించింది.

ఈ క్రమంలో వ్యక్తిగత పని పైనే అంటూ బొత్స నాలుగు రోజులపాటు ఢిల్లీలో గడపడం ఇదే నేపథ్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రకటన వెలువడటం గమనార్హం. ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్స, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పిసిసి మాజీ చీప్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపి కావూరి సాంబశివరావు, పిఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి సర్కారుకు అండగా నిలిచిన చిరంజీవిని సభ్యులుగా నియమించారు. రోశయ్య హయాంలో ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్న కెవిపి, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డిలను ఈసారి మాత్రం తప్పించారు. ప్రస్తుత కమిటీలో తెలంగాణకు పెద్ద పీట వేశారు.

సిఎం కిరణ్, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా బొత్స, కావూరి కోస్తా ప్రాంతానికి చెందిన వారు. కమిటీలోని దామోదర రాజనరసింహ, డిఎస్, షబ్బీర్ అలీ తెలంగాణ నేతలు. కాగా కమిటీలో కిరణ్ వర్గీయులెవరికీ చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పైగా... బొత్స, చిరంజీవి, డిఎస్ ముగ్గురూ కొన్ని రోజులోగా సమన్వయంతో పని చేస్తున్న నేతలే. ముఖ్యమంత్రి దూకుడుకు కళ్లెం వేసేందుకే అధిష్ఠానం వీరిని కమిటీలో చేర్చి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. పైగా బొత్స, చిరంజీవి, డిఎస్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని కాంగ్రెస్‌లోని కొందరు గుర్తు చేస్తున్నారు. రెడ్డి వర్గం ప్రాధాన్యం తగ్గిందనే వారూ ఉన్నారు.

కమిటీలో మహిళలకు కూడా స్థానం కల్పించ కపోవడం సరైంది కాదన్నారు. అయితే మహిళా నేతను కమిటీలో త్వరలో నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నిజానికి శాఖల కేటాయింపుపై పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం అటకెక్కిందని అధిష్ఠానం గ్రహించింది. అయితే కిరణ్‌కు బాధ్యతలు అప్పగించిన కొత్తలోనే సీనియర్ మంత్రుల అభిప్రాయాలకు తలొగ్గితే పాలనపై సిఎంకు పట్టు తప్పుతుందని గ్రహించింది. అందుకు మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఊపినా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో మార్పులకు అవకాశం లభించలేదు. ఇప్పుడు లోక్‌పాల్‌పై ఒక ఘట్టం ముగియగానే సమన్వయ కమిటీపై నిర్ణయం వెలువడింది.

మరోవైపు సమన్వయ కమిటీలో చిరుకి చోటిచ్చిన అధిష్ఠానం, రాష్ట్ర కేబినెట్‌లోనూ పిఆర్పీకి చోటిచ్చేలా విస్తరణ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా రోశయ్య హయాంలో ఎనిమిది మంది సభ్యులు ఉండగా ఇప్పుడు ఏడుగురికే పరిమితం చేశారు. మహిళలకు చోటు దక్కలేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి ఈసారి అవకాశం ఇచ్చారు. సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తున్న కావురికి ప్రాధాన్యమిచ్చిన అధిష్టానం తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న వారెవరికీ చోటు కల్పించలేదు. గతంలో ముగ్గురు ఎంపీలకు కమిటీలో చోటు దక్కగా ఈసారి కావూరి మాత్రమే ఉన్నారు.

English summary
It seems, High Command's coordination committee will put check to CM Kiran Kumar Reddy in ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X