వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ తో గెలుపు గుర్రాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను పెట్టబోయే పార్టీయే అధికారంలోకి వస్తుందని, ముప్పయ్యేళ్లు అధికారంలో ఉంటుందని అంటున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి తన వెంట ఉన్నవారిలో గెలుపుగుర్రాలు ఎవరో తెలుసా. అధికార పార్టీనుండి పదవులు రాక అసంతృప్తితో వివిధ పార్టీలనుండి వస్తున్న వారికి ప్రజాభిమానం ఏ మేరకు ఉంది. తనతో వచ్చే వారు సొంతంగా గెలవగలరా అనే విషయాలను జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారో లేక తన ఇమేజ్, తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ వారిని గెలిపిస్తుందని జగన్ నమ్ముతున్నారో తెలియదు కానీ జగన్ వెంట వెళుతున్న వారిలో ఎక్కువమంది సొంత ప్రజాబలంగానీ, సొంత బలగం గానీ లేని వ్యక్తులే కావటం గమనార్హం. కొండా సురేఖ, రోజా, అంబటి రాంబాబులు తదితరులలో అసలు గెలిచే వారు ఉన్నారా.

ప్రతి విషయంలో జగన్‌కు అండగా ఉంటున్న వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా మాజీ మంత్రి, పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖకు జిల్లాలో, నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అయితే తెలంగాణను వ్యతిరేకిస్తున్న వైయస్ కుటుంబంతో ఉండటం ఆమెను నష్టం కలిగించే అంశమే. అందులోనూ జగన్‌కు ఆసలు తెలంగాణలో బలగమే లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి కొండా సురేఖతో వెళ్లడానికి స్థానిక కార్యకర్తలు పెద్దగా ఇష్టపడటం లేదు. ఇక ఇదే జిల్లానుండి జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీ పుల్లా పద్మావతికి గానీ, కరీంనగర్ జిల్లా నుండి మద్దతు తెలుపుతున్న గోనె ప్రకాశరావుకు గానీ, నిజామాబాద్ జిల్లా బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి గానీ సొంత బలమేలేదు.

గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబుకు సైతం గెలిచే అంత సీను లేదు. ఆయనకు తన నియోజకవర్గంలో కూడా బలగం లేదు. జగన్ పేరుతో నిలబడినా ఫలితం లేకపోవచ్చుననే పలువురు భావిస్తున్నారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, జగన్ పంచన చేరిన సినీ నటి, ఫైర్ బ్రాండ్ రోజా పరిస్థితి మరీ దారుణం. సినీస్టార్ ఇమేజ్‌తో పాటు రాష్ట్రంలో గట్టి పట్టు ఉన్న తెలుగుదేశం పార్టీనుండి పోటీ చేసినప్పటికీ ప్రజలు ఆమెను తిరస్కరించారు. ఆమె రెండుసార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేని పరిస్థితి. ఇక దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి పరిస్థితి అందుకు మినహాయింపు ఏమీ కాదు. పేరుకే ఆమె పార్టీ. ఎన్టీఆర్ టిడిపి ఏ ఒక్క సీటు గెలుచుకోవడం మాట అటుంచితే ఏ ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఎన్టీఆర్ పేరును వాడుకున్నప్పటికీ ప్రజలు ఆమెను ఆమోదించడం లేదు.

నెల్లూరులో గోపాల్‌రెడ్డి, తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలకు కాస్తో కూస్తో బలం ఉన్నప్పటికీ గట్టి పోటీ ఎదుర్కొనవలసి ఉంటుంది. నెల్లూరులో గోపాల్‌రెడ్డి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిలను ఎదుర్కొని నిలబడటం కష్టమే అని పలువురు భావిస్తున్నారు. తిరుపతిలో చెవిరెడ్డి మంత్రి గల్లా అరుణకుమారితో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా కావడం గమనార్హం. కడప జిల్లాలో జగన్ వెంట ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటు వైయస్, అటు తమ సొంత ప్రతిష్టతో గట్టెక్కినా, కర్నూలు, అనంతపురంలలో కష్టమే. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి పట్టు ఉంది. జిల్లాలో ఆయన తమ్ముడు, భార్య ఇలా పలువురు పార్టీ అభిమానులను కాకుండా తమ సొంత క్యాడర్‌ను గట్టిగా ఏర్పరుచుకున్నారు. ఇక్కడ బొత్సను అడ్డుకోవడం జగన్‌కు సులువేమీ కాదు. ఖమ్మం జిల్లాలో సైతం సత్యవతి, కాంతారావులకు జనబలం అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో జగన్ టార్గెట్ 2014 తనతో నడిచే వారిపైన కాకుండా పూర్తిగా వైయస్ ఇమేజ్ పైనే ఆధారపడవలసి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X