సీనియర్ల గరం: బొత్స సత్తిబాబు అసహనం

మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నందీశ్వర్ గౌడ్ స్థానంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిని నియమించడం స్థానిక వర్గాల్లో అసంతృప్తికి దారితీసింది. వరంగల్ జిల్లాకు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి స్థానంలో దొంతి మాధవరెడ్డిని నియమించడం కూడా స్థానికంగా వర్గ రాజకీయాలకు ఆజ్యం పోసింది. సీనియర్ మంత్రినైన తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా మెదక్‌లో నాయకత్వాన్ని ఎలా మార్చారంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మెదక్ జిల్లాకు చెందిన మంత్రి గీతారెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
బొత్స నిర్ణయం వల్ల జిల్లాలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయిందని బొత్సతో ఆమె చెప్పినట్లు సమాచారం. అందరినీ సంప్రదించాల్సిందని ఆమె అన్నారని సమాచారం. అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఈ విషయంలో తాను చేసేదేమీ లేదని బొత్స చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఈ బాధ్యత నిర్వర్తించడం ఇష్టం లేదంటే మానేస్తానని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
బొత్స సత్యనారాయణ తీరుపై కొందరు కాంగ్రెసు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. పదేళ్లకు పైగా తాను వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తనను మార్చేశారని గండ్ర వెంకటరమణా రెడ్డి అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కడప జిల్లా ఇంచార్జీగా నియమితులైన కందుల శివానందరెడ్డి ఆ బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌ను ఎదుర్కోవాల్సిన స్థితిలో ఆయన ఆ పదవిని చేపట్టాలా, వద్దా అనే మీమాంసలో పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications