జగన్‌పై తిరగబడుతున్న వైయస్ మాటలు

పత్రికా స్వేచ్ఛకు, పత్రికా యాజమాన్యంపై చర్యలకు సంబంధం లేదని ఈనాడు అధినేత రామోజీ రావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై చర్యల విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి శానససభలో అన్నారు. "ఏదైనా మీడియాకు సంబంధిం చిన యజమాని చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేస్తున్నట్లు ఆరోప ణలు వస్తే ప్రభుత్వం ఏం చేయాలి అధ్యక్షా? మీడియాతో గొడవ ఎందుకంటే ఆ మీడియా అధిపతి చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసినా కూడా , ఆయనను ఏమన్నా అంటే, నన్ను అపఖ్యాతి పాలు చేస్తున్నారని, వాళ్లు చేసిన చట్ట వ్యతిరేక పనులను చూస్తూ వదిలేయాల్నా? మీరు చెప్పండి అధ్యక్షా? కానీ ప్రతిపక్షాలు వదిలేయాలని ముక్తకంఠంతో అంటున్నాయి అధ్యక్షా? కొన్ని పత్రికలు, కొన్ని టీవీ చానెళ్లు అనకపోయినా ప్రతిపక్షాలు మటుకు అంటున్నాయి. అది కాదు అధ్యక్షా..
నాంపల్లి నుంచి న్యూఢిల్లీ కోర్టు వరకూ ఫలానా పత్రిక యజమాని, ఫలానా వ్యాపారంలో, ఈ రాష్ట్రంలో ఇంతవరకూ మొత్తం కో ఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించిన కుంభకోణాలు వెయ్యికోట్లు కూడా ఉంటాయో లేదో! రు.600 కోట్లు! దాదాపు 2700 కోట్లు పూర్తిగా చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు కింద కలెక్ట్ చేసి ఆ డబ్బు, తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేరుతో పెట్టుకుంటే.. దానికి సంబంధించి ఎంకై్వరీలు చేయాల్సి వస్తే మేము ఎంకై్వరీ చేయడం తప్పు అవుతుందా? ఈరోజు కూడా చెబుతున్నా అధ్యక్షా.. ఆయన వద్ద దాచి పెట్టడానికి ఏమీ లేదనుకుంటే, ప్రతిరోజూ నాంపల్లి నుంచి న్యూఢిల్లీ కోర్టు వరకూ తిరిగి తిరిగి, మేము చేస్తున్న ఎంకై్వరీని అడ్డుకోవలసిన అవసరం ఏమి వచ్చింది అధ్యక్షా" అని వైయస్ శాసనసభలో చేసిన ప్రసంగం సిడిని తెలుగుదేశం పార్టీ విడుదల చేశారు.
పత్రికా స్వేచ్ఛకు, పత్రికా యాజమాన్యాలు చేసే అక్రమ లావాదేవీలకు సంబంధం లేదని, పత్రికా యాజమాన్యాలు చేసే అక్రమాలను సహించడం సరి కాదని వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వాదనను వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా విషయంలో ప్రచారంలోకి తెస్తున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, జర్నలిస్టు సంఘాలకు మింగుడు పడని విషయంగా మారింది. సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసిన రోజును జగన్ బ్లాక్ డేగా అభివర్ణించారు. అయితే, ఆయన మాటలను ఆయన తండ్రి మాటల్లోనే తిప్పికొట్టే పరిస్థితి ఏర్పడింది.
గతంలో ఈనాడు అధినేత రామోజీరా వుకు సంబంధించిన మార్గదర్శిపై కేసులు, సీఐడీ కేసులు, తనిఖీల వ్యవహారం తాజా ఘటనతో తెరపైకి రావడంతో జగన్, ఆయనకు దన్నుగా నిలిచిన కొన్ని జర్నలిస్టు సంఘాల నాయకులకు మింగుడు పడడం లేదు. మార్గదర్శిపై దాడు ల, కేసులు, తనిఖీల వ్యవహారాన్ని, మీడియాను ఒకేగాట కట్టకూడదని, నిజంగా రామోజీరావు ఎలాంటి తప్పు చేయని వారయితే ఆయన భయపడవలసిన పనిలేదని, నాంపల్లి నుంచి సు ప్రీంకోర్టుకు వెళ్లవలసిన అవసరం లేదని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఆ మాటలే ఇప్పుడు జగన్ వాదనలను తిప్పికొట్టడానికి ప్రత్యర్థులకు పనికి వస్తున్నాయి.
.మీడియా, వ్యాపారాలు వేర్వేరని, మీడియా సంస్థల యజమానులు తప్పు చేస్తే కేసులు పెట్టకూడదా? అని నాడు వైఎస్ చెప్పిందే ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తున్నప్పుడు దానిపై గొడవ చేయడం ఏమిటని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో చేసిన వాదన ఇందుకు అనుగుణంగానే ఉంది. వైయస్ మాటలను పాటించండని ఆయన జర్నలిస్టులకు సలహా కూడా ఇచ్చారు.నాడు రామోజీరావును ఉద్దేశించి వైఎస్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు జగన్‌కూ వర్తిస్తాయని జగన్ ప్రత్యర్థులు అంటున్నారు.












Click it and Unblock the Notifications