బాబు వ్యూహం: జగన్, కెసిఆర్ ఆటకట్టు

పార్టీ మారాలని భావిస్తున్న నేతల ఇళ్ల ముందు బైఠాయింపు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులను ఆదేశించారు. చంద్రబాబు శుక్రవారం ఉదయం నుంచి పలు ధపాలుగా పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు సాగించారు. వివిధ జిల్లాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం తొలుత నిజామాబాద్ జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు కలిశారు.
సాయంత్రం సీనియర్ నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, గరికపాటి రామ్మోహన్‌రావు, అరవింద్‌కుమార్‌గౌడ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు కలిశారు. సీనియర్ల సమావేశంలో ప్రధానంగా పార్టీ వీడివెళుతున్న వారిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. సాధారణ ఎన్నికలకు ఇంకా పది నెలల గడువు మాత్రమే ఉన్నందున పార్టీలు మారడం ఎక్కువయ్యే అవకాశం ఉందని, దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇళ్ల ముందు ఆందోళన కొంత వరకు ఉపయోగపడతాయని అంటున్నారు.
ఈ ప్రక్రియ తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదు. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసిన సమయంలో ఎమ్మెల్యేల ఇంటి ముందు టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేశారు. తరువాత 1995లో టిడిపి ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ను వీడి చంద్రబాబు వర్గంలో చేరినప్పుడు ఇదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు టిడిపి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఇప్పుడు మరోసారి నాయకుల ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని టిడిపి నిర్ణయించుకుంది.
ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నాయకుడు దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పుడు కొంతమంది కార్యకర్తలు పార్టీ వీడి వెళ్లవద్దని ఆందోళన చేశారు. విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు టెలిఫోన్‌లో దాడి వ్యవహారంపై మాట్లాడారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల్లో సైతం నాయకుల ఇళ్ల ముందు ఆందోళన చేయాలని టిడిపి నాయకత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications