రివర్స్: చిరంజీవికి చోటేదీ, ఆయన మాటేదీ?

సమావేశం జరిగిన హాల్ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కానీ, బయట ఉన్న వాటిలో కానీ చిరంజీవి బొమ్మను లేదు. ఉదయం సమావేశం ప్రారంభం కాకముందే సమావేశం హాలు బయట చిరంజీవి ఫొటో ఫ్లెక్సీలలో లేకపోవటంపై అభిమానులు నిరసనకు దిగారు. తమ అభిమాన నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ జోక్యం చేసుకొని పొరపాటు జరిగిన మాట వాస్తవమే అని, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వటంతో గొడవ సద్దు మణిగింది. అంతకు మించి చిరంజీవి ప్రాధాన్యం సమావేశంలో కనిపించలేదు.
ఈ గొడవ బయట ముగిసినప్పటికీ సమావేశం జరుగుతున్న హాలులో వేదికపైనుంచి ప్రసంగించిన సీనియర్ నేతలెవరూ చిరంజీవి ప్రస్తావన మాట మాత్రంగానైనా తీసుకురాకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కృష్ణమూర్తి వద్ద నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దాకా ఎవరి ప్రసంగాలలోనూ చిరంజీవిని పట్టించుకోలేదు. దీన్నిబట్టి చిరంజీవికి అంత ప్రాధాన్యం లేదనే విషయం అర్థమవుతోంది.
పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి కొందరు మంత్రులు హాజరైనప్పటికీ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మాత్రం హాజరు కాలేదు. చిరంజీవి కోటాలోనే మంత్రి పదవి పొందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక శాసనసభ్యుల్లో ఒక్క కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రమే సమావేశంలో పాల్గొనటం కనిపించింది.
ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం అంటూ లేకపోయినప్పటికీ, చిరంజీవి వర్గం నుంచి దాదాపు ఎవరూ హాజరు కాకపోవటం మాత్రం కొట్టవచ్చినట్టు కనిపించింది. సి.రామచంద్రయ్య వ్యక్తిగత కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉన్నందున హాజరు కాలేకపోయారని, గంటా శ్రీనివాసరావు విదేశాలలో ఉన్నారని పార్టీ వర్గాలు వివరణ ఇచ్చాయి.












Click it and Unblock the Notifications