కిరణ్: రాజీనామానా, అధిష్టానం వ్యూహమా?

రాష్ట్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతనే విభజనపై ముందుకు వెళ్లాలని ఆయన సూటిగా అధిష్టానానికి మీడియా ద్వారా తెలిపారు. మంత్రులు, ముఖ్య నేతల మధ్య దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తారని తెలిసినా.. ఈ స్థాయిలో మాట్లాడతారని ఎవరూ ఊహించలేదంటున్నారు.
అధిష్టానం సూచనల మేరకు మొదట రాజీనామాలు చేసిన మంత్రులు, నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేసిన సిఎం, ఇప్పుడు ఇంత సీరియస్‌గా మాట్లాడుతారనుకోలేదని, వీటిని అధిష్టానం ఎలా తీసుకుంటుందనే చర్చ సాగుతోంది. విభజన ప్రక్రియలో పాలుపంచుకోలేనని అధిష్టానానికి కుండబద్దలు కొట్టిన కిరణ్... ఆ ప్రక్రియ వేగవంతం కావడంతో, మరోసారి తన హెచ్చరికలో భాగంగానే ఇలా చేసి ఉంటారని అంటున్నారు. అధిష్టానం అలాగే ముందుకు వెళ్తే రాజీనామాకు కూడా వెనుకాడకపోవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి వెనుక అధిష్టానం లేకపోలేదని కూడా చెప్పలేమని మరికొందరు చెబుతున్నారు. విభజన తర్వాత సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తరఫున వెల్లువెత్తే నిరసనను తట్టుకునే వ్యూహంలో భాగంగా ఇది కావచ్చునని అంటున్నారు. విభజన ద్వారా ఎలాగు తెలంగాణలో కాంగ్రెసు పార్టీ మంచి మెజార్టీ సాధించే అవకాశముంది. సీమాంధ్రలో పట్టు కోల్పోకుండా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా అధిష్టానం సిఎంతో ఇలా వ్యాఖ్యలు చేయించడం లేదని కొట్టిపారేయడానికి వీల్లేదని కొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications