విభజన: ప్రణబ్ పైనే 'సమైక్య' ఆశలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రణబ్ ముఖర్జీ మొదటి నుండి వ్యతిరేకించటం అందరికి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ముందుకు పడనివ్వలేదంటారు. అందుకే రాష్టప్రతిగా ప్రణబ్ ముఖర్జీ తమను అర్థం చేసుకుంటారనే ఆలోచనతో సమైక్యవాదులు ఆయనను ఆశ్రయిస్తున్నారట. రాష్టప్రతి రాష్ట్ర విభజనను అడ్డుకోవటం ద్వారా తమను ఆదుకుంటారని వారు ఆశిస్తున్నారు.
మంత్రులు రఘవీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మూలంగా సీమాంధ్రులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి వివరించారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్రులు అన్ని రంగాల్లో దెబ్బ తింటారని వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినాయకత్వం, యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను రాష్టప్రతి ద్వారా అడ్డుకోవాలనే ఆలోచనతో సమైక్యవాదులు ప్రణబ్ ముఖర్జీని కలుస్తున్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేతలు మైసూరా రెడ్డి తదితరులు మంగళవారం ప్రణబ్ ముఖర్జీని కలిసి సమైక్యాంధ్రపై తమ వాదన వినిపించారు.
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్ధృతంగా జరుగుతున్న ఉద్యమాన్ని వారు ఆయన దృష్టికి తెస్తూ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారట. అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్ మరికొందరు నాయకులు ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్ర విభజనను ఆపాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం రాష్ట్ర విభజన సాధ్యం కాదనే అంశంపై వారు రాష్టప్రతికి తమ వాదన వినిపించారు.
యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధినాయకత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు పూనుకుంటే దానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అడ్డుకట్ట వేయాలని సమైక్యవాదులు కోరుకుంటున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా తనను కలిసిన వారందరికి కూడా న్యాయం జరిగేలా చూస్తానని చెబుతున్నారట. అయితే ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాననేది చెప్పటం లేదు.












Click it and Unblock the Notifications