దూకుడులో తడబాటు: జగన్‌కు సెంటిమెంటేనా?

ఈ నెల 13న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అయితే ఈ సమావేశాల్లో జగన్ పార్టీ వ్యూహాలు వారికే సంతృప్తినివ్వలేదట. అనుకున్నంతగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఇరుకున పెట్టలేకపోయారట. ఈ చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో టిడిపిపై ఒత్తిడి తెచ్చిన జగన్ పార్టీ, తామే స్వయంగా అవిశ్వాసాన్ని పెట్టడంలో తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ముందు ఉండలేక పోయింది.
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించినా, అప్పటికే చేయిదాటింది. చివరికి ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చినా.. తమకంటే ముందుగా తెరాస ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవటంతో సభలో ఆ పార్టీని అనుసరించటం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనివార్యమైంది. అవిశ్వాసం చర్చలో అందరూ వైయస్ పైన రాజకీయ దాడి చేస్తుంటే ఆ జగన్ పార్టీ సభ్యులు సమర్థంగా తిప్పికొట్టలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తర్వాత 21న జరిగిన సడక్ బంద్ అరెస్ట్‌లపై సభలో హోంమంత్రి ప్రకటన, చర్చ జరిగినా.. జగన్ పార్టీ పెద్దగా స్పందించలేదు. విద్యుత్ సమస్యపై ఆందోళన విషయంలోనూ టిడిపి దూకుడును పార్టీ సభ్యులు అందుకోలేకపోయారని అంటున్నారు. 22న సభ వాయిదా పడిన తర్వాత విద్యుత్‌పై అసెంబ్లీ హాల్లోనే బైఠాయించాలని ఎమ్మెల్యేలు భావించారు. అయితే, అదేరోజు టిడిపి ఎమ్మెల్యేలు సభలో అర్ధరాత్రి వరకు ఉండి హల్‌చల్ చేశారు.
చివరికి విద్యుత్ సమస్యపై సభలో స్వల్పకాలిక చర్చలో జగన్ పార్టీ వాణి రాజకీయ విమర్శలు, నల్ల టీ షర్టులు ధరించి, కొవ్వొత్తులు వెలిగించటానికి పరిమితమైంది తప్ప, ప్రభుత్వ తప్పులను నిర్మాణాత్మకంగా వేలెత్తి చూపించలేకపోయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చివరి రోజు మంగళవారం విద్యుత్‌పై టిడిపి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటే, అప్పటికే ఆందోళనల్లో వెనుకబడిందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ చివరి క్షణంలో అసెంబ్లీ గేట్-2 వద్ద కొద్దిసేపు ధర్నా చేసి తమ నిరసనను తెలిపింది.
సభలోనే కాకుండా బయట కూడా కేవలం వాదనే తప్ప ఏ విషయంలోను స్పష్టమైన వివరణ ఆ పార్టీ ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా అయితే జగన్ ఉప ఎన్నికల్లోలా సెంటిమెంట్‌ను, తన బలాన్ని నమ్ముకోవాల్సిందే తప్ప సభలో లేదా బయట ఇతర పార్టీలపై ఎదురుదాడిని లేదా వారికి స్పష్టమైన సమాధానం ఇచ్చే విషయాన్ని పక్కన పెట్టాల్సిందే అని సెటైర్లు వినిపిస్తున్నాయి. మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications