చిరంజీవికి కీలక పదవిపై రాహుల్ గాంధీ హామీ
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శనివారం సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు రాహుల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఆయనతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చిరంజీవికి రాహుల్ ఈ సందర్భంగా చెప్పారట.
సీమాంధ్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ఏ విధంగా కాపాడిందనే విషయాన్ని, విభజనతో పోలవరం ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తవుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీదేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించినందువల్ల ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిరంజీవికి సూచించారు.

కాపులను బిసిలుగా గుర్తించేందుకు 9వ షెడ్యూలులో మార్పులు చేసే విషయంపై చిరంజీవి రాహుల్‌తో చర్చించారని, అందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారట.
మరోవైపు తెలంగాణ నేతల పట్ల రాహుల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసహనం వ్యక్తం చేశారట. తెలంగాణ ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నామని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారట. అయితే, తెలంగాణలో పార్టీ పరిస్థితి అనుకూలంగానే ఉందని, తెరాసతో పొత్తు లేకపోయినా విజయం సాధిస్తామని, అయితే ఉద్యమంలో పాల్గొన్న కొత్త శక్తులను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ నేతలు ఆయనకు తెలిపారు.
మీరు అడిగినట్లుగా తెలంగాణ ఇచ్చామని, దీనివల్ల సీమాంధ్ర ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలుసునని, తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకొని పార్టీని ఐక్యంగా ముందుకు నడిపించాలని తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో చతుర్ముఖ పోటీ ఉంటుందని, కాబట్టి కాంగ్రెసు పార్టీ లాభపడే అవకాశాలు ఎక్కువ అని తెలంగాణ ప్రాంత నేతలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications