తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రక్షణకు తానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన సొంత బుల్లెట్ ప్రూఫ్ కారును సిద్ధం చేసుకుంటున్నారు. పది లక్షల రూపాయలు పెట్టి ఆయన టాటా సఫారీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. మరో 30 లక్షల రూపాయలతో దానికి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా అంబాసిడర్ కార్ల స్థానంలో టాటా సఫారీ కార్లను ప్రవేశపెట్టుకోవాలని ఆయన చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేసుకున్నారట. ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో చంద్రబాబు తనకు తానే రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యుక్తులైనట్లు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలకు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితిలో పడ్డారు. దీంతో తగిన భద్రత అవసరమని ఆయన భావించినట్లున్నారు. నక్సలైట్ల నుంచి ముప్పు ఉండడంతో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.