తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దొంగాట మొదలు పెట్టారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష వివాదం రగులుతుంటే ఆయన నోరు విప్పకపోవడం సరే, తెలంగాణ పార్టీ నాయకులకు కూడా టోకరా ఇచ్చారనే మాట వినిపిస్తోంది. గ్రూప్ వన్ పరీక్ష వివాదంపై చర్చించడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. స్పష్టమైన వైఖరి తీసుకోవడానికి వీలు లేకపోవడం వల్లనే ఆయన చర్చకు నిరాకరించినట్లు చెబుతున్నారు. ఆయన కచ్చితంగా సీమాంధ్ర వైపు ఉన్నందువల్ల కూడా చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చర్చ జరిగితే పార్టీ తెలంగాణ నాయకులు తమ వాదనను వినిపించే అవకాశం ఉంది. దాన్ని సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తారు. సీమాంధ్ర నాయకులను కాదనే పరిస్థితి చంద్రబాబుకు లేదని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి వంటి తెలంగాణ నాయకులు గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుండగా పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు వంటి సీమాంధ్ర నాయకులు పరీక్ష నిర్వహించాలని పట్టుబట్టారు. రెండు ప్రాంతాల నాయకులు ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉండడం వల్ల చంద్రబాబు దాంట్లో తలదూర్చి విమర్శలను కొని తెచ్చుకోవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.