నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. దళితుల ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను రెండింటిని నెలకొల్పారు. ఒకదాన్ని అగ్రవర్ణాలవారు నెలకొల్పగా, మరోదాన్ని దళితులు నెలకొల్పారు. ఈ రెండింటిని వైయస్ జగన్ ఆవిష్కరించాల్సి ఉంది. అయితే, అగ్రకులాలు నెలకొల్పిన విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ దళితులు నెలకొల్పిన విగ్రహాన్ని పట్టించుకోలేదు. దీంతో దళితులు జగన్ పై మండిపడుతున్నారు. విగ్రహ స్థాపనకు తన జేబులోంచి 50 వేల రూపాయలు ఖర్చు చేశానని విజయకుమర్ అనే దళితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహంతో తాను కట్టిన బ్యానర్లనే స్వయంగా చించేశారు. అగ్రకులాలవారు వద్దని చెప్పడంతో జగన్ తమ విగ్రహాన్ని ఆవిష్కరించలేదని దళితులంటున్నారు. అయితే, ఆ చర్యను సమర్థించుకోవడానికి జగన్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఆ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించలేకపోయారని వారంటున్నారు.