అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హైదరాబాద్ రాకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కారణమని నిందిస్తున్నారు. తెలగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను హైదరాబాద్ రప్పించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు బరాక్ ఒబామా హైదరాబాద్ రాకపోవడానికి కెసిఆర్ ప్రధాన కారణమని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం అంటోంది. కెసిఆర్ కు భయపడి ముఖ్యమంత్రి కె. రోశయ్య ఒబామాను హైదరాబాదుకు ఆహ్వానించలేదని విమర్శిస్తోంది. ఒబామాను హైదరాబాద్ ఆహ్వానించాలని రోశయ్య తొలుత అనుకున్నారట. అయితే, తెరాస హంగామా చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం పొందే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒబామా కాన్వాయ్ ని అడ్డుకోవడానికి కూడా కెసిఆర్ తన మనుషులను పంపగలిగిన దిట్ట అని అంటూ ఒబామాను ఆహ్వానించవద్దని రోశయ్యకు కొంత మంది సలహా ఇచ్చారట. దాంతో రోశయ్య తన ప్రయత్నాన్ని మానుకున్నట్లు చెబుతున్నారు.