చేసుకున్నవారికి చేసుకున్నంత అని పెద్దలు ఊరికే అనలేదు. కడప జిల్లా లోకసభ సభ్యుడు సాయి ప్రతాప్ విషయంలో ఆ మాట నిజమేనని అనిపిస్తోంది. దివంగత నేత వైయస్సార్ చలువతో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్న సాయి ప్రతాప్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించకపోవడం అసలుకే ముప్పు తెచ్చినట్లు భావిస్తున్నారు. సాయి ప్రతాప్ సోదరుడు హరినాథ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ పురోగతికి చేసిందేమీ లేదు. పైగా, కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా వైయస్ జగన్‌పై పోరాటం చేయడానికి వెనకాడారు. విధేయత జగన్ వైపు ఉందని గ్రహించిన పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు.