తన కోసం గొంతు చించికుంటున్న అంబటి రాంబాబుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ షాక్ ఇచ్చారు. కాంగ్రెసు నాయకత్వాన్ని ధిక్కరించి రాంబాబు జగన్ వెంట నడిచారు. జగన్‌ను సమర్థించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. నిజానికి, వైయస్ జగన్ మాటను అంబటి రాంబాబు తన నోట వినిపిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే, ఆశ్చర్యకరంగా రాంబాబుకు జగన్ ఝలక్ ఇచ్చారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో అంబటి రాంబాబుకు చోటు కల్పించలేదు. అంటే, పార్టీ నిర్ణయాల్లో అంబటి పాత్ర ఉండదని అర్థం.
కాగా, అంబటి రాంబాబును పార్టీ అధికార ప్రతినిధిగా మాత్రం వేశారు. గట్టు రామచందర్ రావు విషయంలోనూ ఇదే జరిగింది. మొదటి నుంచీ గట్టు రామచందర్ రావు కూడా జగన్ వెంట ఉన్నారు. ఆయనను కూడా ఈ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి తీసుకోలేదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అనుకుంటే సరిపోతుందా, లేదంటే జగన్ ఆలోచనలో మరేమైనా ఉందా అనేది తెలియదు. వారిద్దరిని మరో రకంగా ఆయన వాడుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.