రైతుల ఆత్మహత్యల్లో ప్రేమ కోణాన్ని చూసిన బాబు
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేమ కోణాన్ని కూడా చూశారు.ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారని ఆయన అన్నారు. రైతులు కేవలం కరువు వల్ల మాత్రమే ఆత్మహత్యలు చేసుకోలేదని, ప్రేమ వైఫల్యం, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాడనికి కారణమని ఆయన అన్నారు.
రైతుల ఆత్మహత్యలపై నేషనల్ సాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ రూపొందించిన నివేదికను కూడా ఆయన ప్రస్తావించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై 244 నిబంధన కింద మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ జరిగింది.

రైతు ఆత్మహత్యలపై ఇటీవల శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం చేసిన వాదననే తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసింది. రైతుల ఆత్మహత్యలకు తెలంగాణలో గత కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాలే కారణమని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది.
అదే రీతిలో - తమ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు మాత్రమే అవుతోందని, సమస్యలు సృష్టించినవాళ్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుందని, కాంగ్రెసు ప్రభుత్వం కారణంగానే పరిస్థితి ఇలా తయారైందని తెలుగుదేశం ప్రభుత్వం వాదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే గత ప్రభుత్వం మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గత కాంగ్రెసు ప్రభుత్వమే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications