'తెరాస చీలిక భయంతో.. వైయస్ దారిలో కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జీవన్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి వలసలను ప్రోత్సహిస్తే, ఇప్పుడు కేసీఆర్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెరాస చీలిపోతుందనే అభద్రతా భావంలో కేసీఆర్ ఉన్నారన్నారు.
సోమవారం ఉదయం శాసన సభ ప్రారంభమైంది. ఈ సమయంలో ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తారు. దీని పైన అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే పార్టీ ఫిరాయింపులపై తానిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది.
కాంగ్రెస్ సభ్యులు చర్చ కోసం నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పైన ఆగ్రహం వ్యక్తం ఆయన మండిపడ్డారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు, పార్టీ ఫిరాయింపులను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో దానిపైనే గగ్గోలు పెడుతోందని విమర్శించారు.

పార్టీలను చీల్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకే ఉందని హరీష్ రావు అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సభ రెండుసార్లు వాయిదా పడింది.
అనంతరం జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మండిపడ్డారు. విపక్షాలపై దాడి చేసే రీతిగానే అధికార పక్షం వ్యవహరిస్తోందన్నారు. పూర్తి మెజారిటీ సాధించినా, కేసీఆర్‌లో అభద్రతా భావం పోలేదని, అందుకే ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన సభలో చర్చ జరగాల్సిందే అన్నారు.
సభలో అధికార పక్షం తీరు మారకపోతే హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. తెరాస చీలిపోతుందనే భయం కేసీఆర్‌కు ఉందన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ అడ్డుకునేందుకు వైయస్ వలసలు ప్రోత్సహిస్తే, ఇప్పుడు కేసీఆర్ అభద్రతా భావంతో చేర్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సోమవారం అసెంబ్లీలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకుండా ప్రభుత్వం తమపై దాడికి దిగేలా వ్యవహరిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications