మావోయిస్టు నేత తల్లికి ఎమ్మెల్యే సోలిపేట 'ఆసరా'
మెదక్: మావోయిస్టు నేత తల్లిని మెదక్ జిల్లా దుబ్బాక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానసభ్యుడు సోలిపేట రామలింగా రెడ్డి ఆదుకున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దుపాషి శంకర్ తల్లి నర్సమ్మ (80)కు శాసనసభ్యుడు ఆసరాగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఫలితంగా దౌలతాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాషి నర్సమ్మకు అధికారులు పింఛను తొలగించారు.
కొన్నేళ్లుగా పింఛను తీసుకుంటున్న నర్సమ్మ పేరు ఇటీవల వెల్లడించిన పింఛన్ల జాబితాలో లేదు. దీంతో ఆమె సోలిపేట రామలింగా రెడ్డి వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె విజ్ఞప్తికి స్పందించిన శాసనసభ్యుడు ఆదివారం కలెక్టర్ రాహుల్ బొజ్జాతో ఫోన్‌లో మాట్లాడి, ఆమెకు పింఛను మంజూరు చేయాలని కోరారు.

నర్సమ్మకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు శంకర్ 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. సోలిపేట రామలింగా రెడ్డి జర్నలిస్టుగా పనిచేసేవారు. మెదక్ జిల్లాలోని దుబ్బాకు చెందిన ఆయన ఉదయం, వార్త వంటి దినపత్రికలకు స్థానిక విలేకరిగా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరారు. దుబ్బాక నుంచి ఆయన కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడు ముత్యం రెడ్డిని ఓడించారు. ఓసారి మాత్రం ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications