షర్మిలపై జగన్ పార్టీ ఇలా.. కొత్తపల్లి గీతపై అలా..!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమాభిమానాలు పంచిపెట్టే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో పోల్చలేమని జూపూడి ప్రభాకర రావు నిప్పులు చెరిగారు. అదే సమయంలో ఆయన సోషల్ మీడియాలో షర్మిల, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పైన వచ్చిన అసభ్య కామెంట్ల పైన స్పందించారు.
సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలపై చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తాను కూడా ఈ ఘటనను ఖండించానని ఆయన అన్నారు. కానీ గిరిజన ఎంపీ కొత్తపల్లి గీత విషయంలోనూ ఈ విధంగానే పార్టీ నేతలు వ్యవహరించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కొద్ది రోజుల క్రితం షర్మిలకు ప్రముఖ హీరో ప్రభాస్‌కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీని పైన అందరు మండిపడ్డారు. స్వయంగా ప్రభాస్ కూడా దీనిపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీరియస్ అయింది. షర్మిల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో కొత్తపల్లి గీత విషయంలో స్పందించలేదని జూపూడి అభిప్రాయపడుతున్నారు.
సామాజిక స్పృహలేని పార్టీలు మనుగడ సాగించలేవన్నారు. మారెప్ప తెలివైన వారని, అందుకే పార్టీ నుంచి తొందరగా బయట పడ్డారన్నారు. మారెప్ప, కొండా సురేఖ, సబ్బం హరిల నుండి నేడు జూపూడి ప్రభాకర రావుల వరకు అందరు కూడా వైయస్‌తో జగన్‌ను పోల్చలేమని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications