యూరి ఉగ్రదాడి: జవాన్ ఫ్యామిలీని అవమానించిన బీజేపీ ఎంపీ
లక్నో: బీజేపీ ఎంపీ ఒకరు యూరి ఉగ్రదాడి ఘటనలో అసువులు బాసిన అమరజవాను కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించారు. దీంతో అతని పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరజవాను కుటుంబ సభ్యులు కూడా అతని తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్ పై జరిగన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జవాన్ గణేశ్ శంకర్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో గణేశ్ మృతదేహానికి ఆయన స్వగ్రామమైన గురాపలిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.
దీనికి హాజరైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి వీరజవాను మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... గణేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన ఎవరికి తోచినంత సాయం వారు చేయాలన్నారు. దీంతో పలువురు డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు.

అప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమరజవాను కుటుంబ సభ్యులను ఇది తీవ్రంగా బాధించింది. దీనిని అవమానంగా భావించిన అమర జవాను భార్య గడియా.. తామేమీ బిచ్చగాళ్లం కాదని మండిపడ్డారు. సైనిక లాంఛనాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని, తమను ఇలా అవమానించవద్దన్నారు.
వారి ఆవేదన, ఆగ్రహంతో సదరు ఎంపీ తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి నిష్క్రమించారు. సదరు ఎంపీ తీరు పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా సాయం చేయాల్సిన అతను అక్కడున్న వారి నుంచి విరాళాలు వసూలు చేయడం అమరజవాన్‌ను అవమానించడమే అన్నారు. ఆ తర్వాత ఎంపీ మాట్లాడుతూ.. ఆ కుటుంబాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని, వారికి సాయం చేయాలని మాత్రమే చూశానన్నారు.












Click it and Unblock the Notifications