ఆ కుటుంబానికి రూ.2లక్షల కోట్ల నల్లధనం: పరారీ!
తమ దగ్గర రూ.2 లక్షల కోట్ల నల్లధనం ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన ముంబైకి చెందిన ఓ కుటుంబం కనిపించడం లేదు.
న్యూఢిల్లీ/ముంబై: తమ దగ్గర రూ.2 లక్షల కోట్ల నల్లధనం ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన ముంబైకి చెందిన ఓ కుటుంబం కనిపించడం లేదు. ఐటీ అధికారులకు సమర్పించిన పత్రాల్లో ఆ కుటుంబం ఇచ్చిన అడ్రెస్‌కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ భవనంలో ఉండే మిగతా ఫ్లాట్ల యజమానులు కూడా అందులో ఎవరుంటారో, ఏం చేస్తుంటారో కూడా తెలియదని చెప్పడం విశేషం.
బాంద్రాలోని జూబ్లీ కోర్ట్ ఫ్లాట్ నం.4లో ఉంటున్నట్లు ఆ కుటుంబం తమ డిక్లరేషన్‌లో ప్రకటించింది. కానీ వాళ్లు ఇచ్చిన అడ్రెస్‌లో మాత్రం ఎవరూ లేరు. అయితే ఈ అడ్రెస్‌ను ఆధారంగా చేసుకొని ఆ కుటుంబం జాడ కనిపెట్టడానికి ఐటీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
కాగా, అబ్దుల్ సయ్యద్ (డిక్లరెంట్), మహ్మద్ సయ్యద్, రుక్సానా సయ్యద్, నూర్జహాన్ సయ్యద్‌లుగా వారిని గుర్తించారు. అయితే ఈ కుటుంబం చెప్పిన 2 లక్షల కోట్ల నల్లధనాన్ని కేంద్ర ఆర్థికశాఖ తిరస్కరించింది. ఎవరూ ఇంత సంపదను దాచుకోరన్న కారణంతో ఆ శాఖ ఈ కుటుంబంతోపాటు గుజరాత్ వ్యాపారి మహేష్ షా డిక్లరేషన్‌ను కూడా తోసిపుచ్చింది.

ఈ రెండూ మినహాయిస్తే ఐడీఎస్ కింద వెల్లడైన మొత్తం రూ.67,382 కోట్లకు చేరినట్లు ఆర్థికశాఖ స్పష్టంచేసింది. 71,726 మంది ఈ మొత్తాన్ని వెల్లడించినట్లు తెలిపింది. నల్లధనాన్ని వెలికితీసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో ఐడీఎస్‌ను తీసుకొచ్చింది. ఇలా వెల్లడించిన మొత్తానికి మూడు వాయిదాల్లో 45శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఐడీఎస్ కింద ఆదాయం వెల్లడికి గడువు సెప్టెంబర్ 30తో పూర్తయింది. ఆమరుసటి రోజే కేంద్రం దీనిపై ప్రకటన చేసింది.
మొత్తం 64,275 మంది రూ.65,250 కోట్ల ధనాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఇప్పుడు తాజాగా అన్ని లెక్కలనూ పరిగణనలోకి తీసుకొని ఈ పథకం కింద వెల్లడించిన ఆదాయ అంతిమ లెక్కను రూ.67,382 కోట్లుగా తేల్చింది. ఈ మొత్తంపై పన్ను, జరిమానా రూపంలో ప్రభుత్వానికి రూ.30,321.9 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.15,160.9 కోట్లు వస్తుంది. 1997లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం (వీడీఐఎస్)ను ప్రవేశపెట్టినప్పుడు రూ.9,760 కోట్లను సేకరించారు.












Click it and Unblock the Notifications