ఒక్క దెబ్బకు రెండు: బాబుపై 'చిరంజీవి' ప్లాన్ ఫెయిల్!
విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకొని ఏపీలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న బిజెపికి గట్టి షాక్ తగిలిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చిరంజీవి బిజెపిలో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే.
ఆ వార్తలను చిరంజీవి అదే రోజు కొట్టి పారేశారు. తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే చివరి వరకు ఉంటానని స్పష్టం చేశారు. తనను బిజెపి నేతలు ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. అయితే, చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి ప్రయత్నించిందనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.
చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఏపీలో బలోపేతం కావాలని బిజెపి భావించింది. ప్రస్తుతం ఏపీలో కాపు రాజకీయం నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపులు టిడిపి - బిజెపి కూటమి వైపు మొగ్గారు.

ఇటీవలి వరకు కాపు ఉద్యమం ఏపీ సీఎం చంద్రబాబును చిక్కుల్లో పెట్టడం, దాని వెనుక జగన్ ఉన్నారనే విమర్శలు రావడం, కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ వేయడం తెలిసిందే. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌లు కాపులకు ఒకరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.
తద్వారా కాపులను తమ నుంచి దూరం పోకుండా చంద్రబాబు ప్రయత్నిస్తుండగా, టిడిపి నుంచి తన వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు.. కాపులను దరి చేర్చుకునేందుకు బిజెపి ఇప్పటికే కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఆ పార్టీ కాపు నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు సమయం వచ్చినప్పుడు విమర్శలు చేస్తున్నారు. వీరే చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు మంతనాలు జరిపారన్న వాదనలు వినిపించాయి.
చిరంజీవిని బిజెపిలోకి తీసుకు వచ్చి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు... 2019 నాటికి చిరంజీవి తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కమలం పార్టీ భావించిందని అంటున్నారు. తద్వారా కాపులను టిడిపి నుంచి తమ వైపుకు తెచ్చుకోవడంతో పాటు టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదగాలనుకుందంటున్నారు.
కానీ చిరంజీవి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించడం గమనార్హం. చిరంజీవి సహకారంతో 2019 నాటికి టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదగాలనుకున్న బిజెపికి ఇది షాకేనని అంటున్నారు. అయితే, చిరంజీవి పైన కొందరు బిజెపి నేతలు ఇంకా ఆశతో ఉన్నారట.
చిరంజీవి బిజెపిలో చేరే విషయాన్ని అప్పుడే పూర్తిగా కొట్టి పారేయలేమని, ఈ విషయాన్ని తాము అధిష్టానానికి వదిలేశామని, దీని విషయమై ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగంగా మాట్లాడలేమని ఓ బిజెపి నేత చెప్పనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీని వదిలేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications