ఏడుస్తున్నారా? ఏడిస్తే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా.. తెలుసుకోండి!
చాలామంది శారీరకంగా, మానసికంగా ఎలా బాధ కలిగినా కన్నీళ్లు పెట్టుకుంటారు. కొందరు ఎంత బాధ కలిగినా కన్నీళ్లను దిగమింగుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఏడిస్తే మంచిదని కొందరు, ఏడిస్తే మంచిది కాదని కొందరు చెబుతూ ఉంటారు. అసలు ఏడిస్తే మంచిదా కాదా.. నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ఏడుపు వలన ఉపయోగాలు
ఏడవడం వల్ల నష్టమేమీ లేదని ఏడుపు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో తెల్చారు. రోజుల పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ సంఖ్యలో కన్నీళ్లు పెట్టుకుంటారని వారు వివరించారు. ఎవరైతే కన్నీళ్లను దాచుకుంటారో వారిలో ఇంకా బాధ పెరుగుతుందని కష్టం వచ్చినప్పుడు ఎవరితో అయినా చెబితే స్వాంతన కలుగుతుందని అలాగే ఏడుపు కూడా మనసులోని భారాన్ని దించేసి మన మనసును తేలిక చేస్తుందని చెబుతున్నారు.

ఏడిస్తే నరాలకు రిలాక్స్
ఇక కోపంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏడవడం వల్ల మన తలనరాలు రిలాక్స్ అవుతాయని, కన్నీళ్లు ఎండార్పిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయని చెబుతున్నారు. అది సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందని అంటున్నారు. బాగా ఏడ్చిన తర్వాత శారీరకంగానూ మానసికంగానూ రెండు విధాల ప్రయోజనమే చేకూరుతుంది. మనసులో ఉన్న బాధను ఏడ్చి తీర్చేసుకోవడం వల్ల మన భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి.
మనసులో పెట్టుకుని బాధ పడితే నష్టం
అందుకే భారం తగ్గించి మనసును తేలిక చేసే ఏడుపును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొంతమంది నిద్రపోయే ముందు ఏదైనా గొడవ జరిగినా దేని గురించైనా మనసుకు కష్టం కలిగిన ఆ బాధను మనసులో పెట్టుకొని అలాగే నిద్రపోకూడదని చెబుతున్నారు. ఆ విషయం మనసుకు కలిగిన బాధను కన్నీళ్ళ రూపంలో బయట పెట్టేస్తే మనసుపై ఉన్న ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుందని ఫలితంగా ఎటువంటి అనారోగ్య సమస్య రాదని చెబుతున్నారు.
ఏడిస్తే ఈ ప్రయోజనాలు కూడా
అంతేకాదు కళ్ళల్లో ఉండే దుమ్ము ధూళి కన్నీళ్ళ ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి ఏడ్చినప్పుడు కళ్ళకు కావలసిన తేమ అంది డ్రై ఐస్ సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు. కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల దృష్టి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఏడుపు పెద్దవాళ్లకే కాదు చిన్న పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని, చిన్నారులు శిశువులు ఏడవడం వలన వారు కావలసిన గాలిని తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
ఏడుపును బలవంతంగా ఆపుకోకండి
పిల్లలు తిన్న ఆహారం జీర్ణం కావడానికి కూడా ఏడుపు చక్కగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఏడుపును బలవంతంగా ఆపుకోకండి.. బాధ కలిగినప్పుడు మనసారా ఏడ్చేయండి. అప్పుడే మనసు తేలికపడి ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications