సంతోషానికి, ఆరోగ్యానికి లింక్.. సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలంటే!!
సంతోషం సగం బలం కాదు.. సంతోషమే సంపూర్ణ బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి సంతోషంగా జీవిస్తేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. నేడు ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఆరోగ్యానికి సంతోషానికి ఉన్న లింక్ ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జీవితంలో సంతోషంగా లేని వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం నిర్వివాదాంశం. సంతోషం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. సంతోషంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు సంతోషంగా ఉన్నవారు బాధల నుండి త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘాయుష్షును, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.

విజయాలను సాధించడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని కూడా సంతోషంగా ఉన్న వ్యక్తులే పొందుతారు. జీవితంలో ఎదురయ్యే అనేక అవరోధాలను ఎదుర్కొనే శక్తి సంతోషంగా ఉన్న వారికే ఎక్కువగా ఉంటుంది. మనిషి జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించడానికి కొన్ని ముఖ్యమైన విషయాల పైన దృష్టి పెట్టాలి.
సంతోషంగా ఉండాలి అనుకునే వారు తమకు ఇష్టమైన వారితో సంభాషించాలి. ఇష్టమైన పనినే చెయ్యాలి. మనసుకు చిరాకు కలిగించే వారికి, సానుకూల ప్రవర్తన లేనివారికి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో ఉండాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. మంచి వ్యాపకాలతో కాలక్షేపం చేసేవారికి, తమకు ఇష్టమైన హాబీలను కొనసాగించే వారికి సంతోషం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన తోను, ఇతరులకు సహాయం చేసే ధోరణి తోనూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
అయితే మనిషి సంతోషంగా జీవించడానికి ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యంగా ఉన్నవారు సంతోషంగా ఎక్కువకాలం జీవించగలుగుతారు. కాబట్టి సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి. మనిషి అంతిమ లక్ష్యం సంతోషమే అని ఎంతోమంది గొప్ప వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి సంపద కంటే సంతోషంగా జీవించడంలోనే జీవితం సంపూర్ణం అవుతుందని గుర్తించి, ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications