సమ్మర్ సూపర్ డ్రింక్ 'రాగి గంజి'.. ఇలా చేసుకుంటే నోటికి రుచిగా..!
వేసవిలో చాలామంది ఎక్కువగా అలసిపోతుంటారు. చిన్న పని చేసినా నీరసం వస్తుంది. అలాంటి టైమ్ లో కాస్త జావ తాగితే చాలు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది రాగి జావ చేసుకుంటూ ఉంటారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి మన అమ్మమ్మలు, నానమ్మలు చేసుకునే విధంగా 'రాగి గంజి' ని ప్రిపేర్ చేసుకొని చూడండి. రుచితో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ సూపర్ టేస్టీ రాగి గంజి తయారీ విధానం..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
రాగి గంజిని నేరుగా పిండితో చేసుకోవడం కాకుండా రాత్రంతా నానబెట్టడం వల్ల కలిగే లాభాలు చాలానే ఉంటాయి. ఇలా రాత్రంతా నానబెట్టడం కారణంగా అందులో సహజమైన 'ప్రోబయోటిక్స్' వృద్ధి చెందుతాయి. ఇవి మన ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగి గంజి తయారీ విధానం చూస్తే.. ముందుగా పావు కప్పు రాగి పిండిని తీసుకోవాలి. రాగి పిండిని నీళ్లలో కలిపి రాత్రంతా పక్కన పెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ రాగి మిశ్రమంపైన పేరుకున్న నురగను తొలగించాలి. ఇక మిగిలిన మిశ్రమంతో గంజిని తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మూడు కప్పుల నీటిని పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన రాగి మిశ్రమాన్ని పోయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పిండి ఉడికిన తర్వాత దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక రాగి మిశ్రమం చల్లారిన తర్వాత దానికి తగినంత చిక్కటి పెరుగును కలపాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. అలాగే చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే..












Click it and Unblock the Notifications