వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరణం తర్వాత ఏం జరుగుతుంది..ఎవరికోసం ఈ పాకులాట ?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు.

మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ.. పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.

After a person die the soul leaves the body then what happens

అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు. ఈ లోగా దగ్గరి బంధువు ఒకాయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు.

మరుసటిరోజు వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా .. మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వత్తాసు పలుకుతాడు. నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో.. నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా! మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే పదకొండో రోజు తరువాత తిరుగు ప్రయాణానికి ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.

నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు. అంతలో తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.

నెల తిరగక ముందే మీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వడం జరుగుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు. మొత్తంగా నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు.. అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!

ఒక పండుటాకు ఓక మహావృక్షం నుండి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథంలోంచి నువ్వు కనుమరుగై పోతావు. నీ మరణానంతరం కుడా అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు జంతువులు మరో యజమానిని వెతుక్కుంటాయి.

అంతలో నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ జ్ఞాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.

ఇప్పుడు చెప్పండి.

ఈ విషయంలో స్త్రీలుగానీ , పురుషులుగానీ ఎవరైనా సరే ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం? దేనికోసం తెగ హైరానా పడిపోయావు ? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా ? జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా ? ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు తపించు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ .. బతికినన్నాళ్ళు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది కదూ! ఈ సమాచారం సేకరించినది .. మనల్ని ఆలోచింపజేసేదిలా ఉంది అని మీకు తెలియజేయడం కొరకు ఇవ్వడం జరిగినది. మనకున్న అన్ని ఆశాశ్వతమైన బంధాలకంటే కేవలం భగవత్భందం గొప్పదైన గ్రహించాలి.

English summary
After a person die the soul leaves the body then what happens
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X