Moral stories: పంచతంత్రంలో నక్క - నీలం రంగు తొట్టి
ఒక అడవిలో చండరవుడు అనే ఒక తెలివైన నక్క ఉండేది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసి, ఆహారం కోసం వెతుక్కుంటూ అడవి పక్కనే ఉన్న ఒక ఊరిలోకి ప్రవేశించింది. ఊరి వీధుల్లో తిరుగుతుండగా, కొన్ని వీధి కుక్కలు ఆ నక్కను చూసి మొరుగుతూ వెంటపడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ నక్క ప్రాణభయంతో పరుగులు తీసింది. అలా పరుగెత్తుతూ.. పరుగెత్తుతూ ఒక బట్టల రంగులు వేసేవాడి ఇంటి పెరట్లోకి దూరింది. అక్కడ నీలం రంగు నీళ్లతో నిండి ఉన్న ఒక పెద్ద తొట్టి కనిపించింది. వెనుక వస్తున్న కుక్కలకు చిక్కకూడదనే కంగారులో ఆ నక్క అమాంతం ఆ నీలం రంగు తొట్టిలోకి దూకింది. కుక్కలు కాసేపు వెతికి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
సింహం, పులి కూడా భయపడ్డాయి
కాసేపటి తర్వాత నక్క ఆ తొట్టిలోంచి బయటకు వచ్చింది. దాని శరీరమంతా ముదురు నీలం రంగులోకి మారిపోయింది. తిరిగి అడవిలోకి వెళ్లిన ఆ నక్కను చూసి అడవిలోని జంతువులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. "ఇంత వింత రంగులో ఉన్న ఈ జంతువు ఎవరు? బహుశా దేవలోకం నుంచి వచ్చిన ఏదో గొప్ప ప్రాణి అయి ఉంటుంది" అని సింహం, పులి, ఏనుగు లాంటి బలమైన జంతువులు కూడా భయంతో దూరంగా జరిగాయి. జంతువుల భయాన్ని గమనించిన నక్కకు ఒక దురాలోచన తట్టింది. వెంటనే ఒక ఎత్తైన బండరాయిపైకి ఎక్కి, "ఓ అడవి ప్రాణులారా! భయపడకండి.

ఈ అడవిని పాలించడానికి దేవతలే నన్ను ప్రత్యేకంగా నీలం రంగుతో సృష్టించి పంపించారు. ఇప్పటి నుంచి నేనే మీ అందరికీ రాజును" అని ప్రకటించింది. అమాయకపు అడవి జంతువులన్నీ అది నిజమేనని నమ్మి, నక్కను తమ రాజుగా అంగీకరించాయి. సింహం మంత్రిగా, పులి సైన్యాధ్యక్షుడిగా మారి ఆ నక్కకు సేవలు చేయడం మొదలుపెట్టాయి. కానీ నక్కకు ఒక భయం ఉండేది.. తన తోటి నక్కలు అక్కడే ఉంటే ఎక్కడ తన అసలు రంగు బయటపెడతాయో అని, వాటన్నింటినీ అడవి నుంచి తరిమేసింది.
ఊళ వేయడం మొదలుపెట్టాయి
రోజులు గడిచాయి. ఒకరోజు పౌర్ణమి వెన్నెల రాత్రి, అడవి సరిహద్దుల్లో ఉన్న నక్కల గుంపు ఒకేసారి గట్టిగా "ఊళ" (నక్కల అరుపు) వేయడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం వినగానే, సింహాసనంపై కూర్చున్న ఈ నీలం రంగు నక్క తన సహజ గుణాన్ని ఆపుకోలేకపోయింది. రాజునన్న విషయాన్ని కూడా మర్చిపోయి, తల పైకెత్తి తన తోటి నక్కలతో పాటు గట్టిగా ఊళ వేయడం మొదలుపెట్టింది. ఆ అరుపు వినగానే సింహం, పులి, మిగిలిన జంతువులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. "అరెరే! ఇది దేవత పంపిన ప్రాణి కాదు, ఒక సాధారణ నక్క. మనల్ని ఇన్నాళ్లూ మోసం చేసింది" అని గ్రహించి, తీవ్ర ఆగ్రహంతో ఆ నక్కను అక్కడికక్కడే తరిమికొట్టాయి.
కథలోని నీతి
మనిషి తన పైరూపాన్ని మార్చుకోవచ్చు, నటనతో ఇతరులను కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ, ఏదో ఒక సందర్భంలో తన అసలు స్వభావం, సహజ గుణం కచ్చితంగా బయటపడుతుంది. అబద్ధపు వేషాలు ఎంతోకాలం నిలవవని, నిజాయితీగా ఉండటమే ఎప్పటికీ శ్రేయస్కరమని ఈ కథ తెలియజేస్తుంది.














Click it and Unblock the Notifications
