యమలోకంలో వేటగాడికి షాక్ - తలరాతను మార్చేసిన ఓ చిన్న పిట్ట..!!
మనం చేసే ప్రతి పనికీ ఏదో ఒక రూపంలో ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.మంచి చేస్తే మంచే జరుగుతుంది..చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు.ఇదే కర్మ సిద్ధాంతంలోని అంతరార్థం.అయితే,జీవితంలో మనం చేసే చిన్న సాయం కూడా ఎంతటి గొప్ప మార్పుకు కారణమవుతుందో తెలిపే ఓ ఆసక్తికరమైన కథ ఇది.నిత్యం పక్షులను వేటాడి జీవనం సాగించే ఓ వ్యక్తి,ఒక్క పిట్టపై చూపిన జాలి కారణంగా తన జీవితాన్నే మార్చుకున్నాడు.
చిన్న పిట్ట కోసం మారిన వేటగాడి మనసు
ఒక అడవిలో ఓ వేటగాడు పక్షులను పట్టుకుని విక్రయిస్తూ జీవించేవాడు.ఒకరోజు ఎప్పటిలాగే పెద్ద చెట్టు కింద వలను పరిచి,దుప్పటి కప్పుకుని పక్షుల కోసం ఎదురుచూస్తున్నాడు.ఇంతలో ఓ చిన్న పిట్ట భయంతో అరుస్తూ వచ్చి అతని దుప్పటి కింద దాక్కుంది.దానిని బయటకు పంపించబోతున్న వేటగాడికి ఆకాశంలో ఓ పెద్ద డేగ కనిపించింది.ఆ పిట్టను వేటాడేందుకు డేగ సిద్ధంగా ఉండటాన్ని గమనించాడు.ఒక్క క్షణం అతని మనసులో జాలి కలిగింది.వెంటనే కొన్ని రాళ్లు విసిరి డేగను తరిమేశాడు.ప్రాణాపాయం తప్పడంతో ఆ పిట్ట సురక్షితంగా ఎగిరిపోయింది.

యమలోకంలో వేటగాడికి ఎదురైన తీర్పు
కొన్ని రోజుల తర్వాత వేటగాడు అనారోగ్యంతో మరణించాడు.యమదూతలు అతని ఆత్మను యమలోకానికి తీసుకెళ్లారు.అక్కడ పాపాలు చేసినవారికి విధిస్తున్న కఠిన శిక్షలను చూసి అతడు భయంతో వణికిపోయాడు.ఇంతలో తాను గతంలో వేటాడిన వేలాది పక్షులు అక్కడికి చేరి,తమకు చేసిన అన్యాయానికి శిక్షించాలని యమధర్మరాజును వేడుకున్నాయి.
అదే సమయంలో గతంలో తన ప్రాణాలను కాపాడిన చిన్న పిట్ట అక్కడికి వచ్చి వేటగాడి తరఫున మాట్లాడింది.తనను డేగ నుంచి రక్షించిన విషయాన్ని గుర్తుచేస్తూ అతడిని క్షమించాలని యమధర్మరాజును ప్రార్థించింది.ఆ పిట్ట కృతజ్ఞతాభావానికి,వేటగాడు చేసిన ఒక్క మంచి పనికి యమధర్మరాజు సంతృప్తి చెందాడు.అతడికి మరో ఏడాది ఆయుష్షు ప్రసాదించి భూలోకానికి పంపాలని ఆదేశించాడు.
ఒక్క మంచి పని..జీవితాన్నే మార్చేసింది
భూమిపై వేటగాడి అంత్యక్రియలు నిర్వహించేందుకు చితికి నిప్పు పెట్టబోతున్న సమయంలో అతడు అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు.కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయి అతడిని ఇంటికి తీసుకెళ్లారు.యమలోకంలో జరిగిన అనుభవాన్ని గుర్తుచేసుకున్న వేటగాడు తన తప్పును తెలుసుకున్నాడు.వెంటనే పక్షులను వేటాడే వృత్తిని వదిలేశాడు.తన సోదరులను కూడా జీవహింస చేయవద్దని కోరాడు.
ఆ తర్వాత కూలి పని చేసుకుంటూ ధర్మబద్ధమైన జీవితం గడిపాడు.ప్రతిరోజూ పక్షులకు ధాన్యపు గింజలు వేస్తూ,దైవనామ స్మరణలో కాలం గడిపాడు.యమధర్మరాజు ప్రసాదించిన ఏడాది గడిచిన తర్వాత ప్రశాంతంగా మరణించి స్వర్గలోకాన్ని చేరుకున్నాడని ఈ కథ చెబుతుంది.
నీతి: మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా విలువైనదే.తోటి మనుషులకే కాదు,మూగజీవాల పట్ల కూడా దయ,కరుణ చూపాలి.ఒక జీవి ప్రాణాన్ని కాపాడటం కూడా గొప్ప ధర్మమే.ఎందుకంటే మనం ఇతరులకు ఇచ్చే ప్రాణభిక్ష,ప్రేమ,దయ ఎప్పటికీ వృథా కావు.మంచి మనసుతో చేసే చిన్న పని కూడా మన జీవితంలో గొప్ప మార్పుకు నాంది కావచ్చు.













Click it and Unblock the Notifications
