ఇంట్లో ఇన్వర్టర్, జనరేటర్, సోలార్ ప్యానెళ్లకు కూడా వాస్తు ఉంటుంది తెలుసా?
శివరాత్రికి చలి శివ శివా అంటూ వెళ్లిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. మే నెల వచ్చేసరికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఒకటే ఉక్కపోత. కరెంటు ఉండదు. అటువంటప్పుడు చాలామంది ఇళ్లల్లో ఇన్వర్టర్లను సిద్ధంగా ఉంచుకుంటారు. అపార్ట్ మెంట్లకు జనరేటర్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో మాత్రం జనరేటర్లే పెట్టుకుంటారు. వాస్తు పండితులు చెబుతున్నదాని ప్రకారం జనరేటరైనా, ఇన్వర్టర్ అయినా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటే వాస్తు ప్రకారం బాగుంటుంది అనే విషయాలు చెబుతున్నారు.
నైరుతి లేదంటే దక్షిణం
సోలార్ ప్యానెళ్లు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్తును తయారు చేస్తాయి. కాబట్టి వీటిని నైరుతి లేదంటే దక్షిణం పై కప్పులో అమర్చాలి. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి భాగం ఎత్తుగా, బరువుగా ఉండాలి. సోలార్ స్ట్రక్చర్ అక్కడ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి బరువు పెరుగుతుంది. అలా పెరగడం అనేది ఇంటికి చాలా శుభప్రదం. ప్యానెళ్లు ఉత్తర లేదా తూర్పు దిశల వైపు వాలి ఉండకూడదు. అవి నైరుతిలో ఉండి, వాటి వాలు నైరుతి నుండి ఈశాన్యం వైపు ఉండేలా చూడాలి.

వాయువ్యంలో పెట్టాలి
ఇన్వర్టర్ అనేది విద్యుత్ శక్తిని నిల్వ చేసే పరికరం. "అగ్ని" తత్వంతో పోలుస్తారు. ఆగ్నేయం లేదంటే వాయువ్యంలో పెట్టుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా ఉంటారు. ఈశాన్యం మూలలో పెట్టకూడదు. అక్కడ పెడితే మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. మెట్ల కింద ఇన్వర్టర్ పెడితే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
ఆగ్నేయం లేదా వాయువ్యం
జనరేటర్లు పెద్దవిగా ఉండటమే కాకుండా శబ్దాన్ని, ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. జనరేటర్లను ఇంటి బయట ఆగ్నేయం లేదా వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. జనరేటర్ చాలా బరువుగా ఉంటే, దానిని నైరుతి భాగంలో కూడా పెట్టుకోవచ్చు. జనరేటర్ ప్రధాన గోడకు తగలకుండా కొంత దూరంలో ఉండటం మంచిది. దీని వల్ల వచ్చే వైబ్రేషన్లు ఇంటి పునాదిపై ప్రభావం చూపకుండా ఉంటాయి.












Click it and Unblock the Notifications