హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐడి బెదిరింపు, రాజు కన్నీళ్ళు!

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: 'నీ కుటుంబ సభ్యులనూ తెచ్చి లోపలేస్తాం..''నీ కొడుకులనూ జైల్లో వేస్తాం. ఆ తరువాత నీ భార్య వస్తుంది..' చివరి రోజైన అయిదో రోజు కస్టడీలో ఉన్న రామలింగరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లకు సీఐడీ అధికారులు ఈ విధంగా ప్రశ్నించారు. మొదట మర్యాదగా ప్రశ్నలు అడిగినా చివరి రోజు పోలీసులు ఇలా అవమానించడం, బెదిరించడంతో రామలింగరాజు కన్నీళ్ళు పెట్టుకున్నట్టు తెలిసింది.

ఒక దశలో రామలింగరాజు నుంచి జవాబులు రాబట్టడానికి సీఐడీ అధికారులు ఆయన తండ్రిపై, దేవుళ్లపై ప్రమాణాలు చేయించినట్టు సమాచారం. రామలింగరాజుకు తన కుమారులంటే ఎంతో ప్రేమ. దీన్ని అడ్డం పెట్టుకుని.. 'నీ కొడుకులను కూడా జైల్లో వేయాల్సి వస్తుంది. ఆ తరువాత నీ భార్య వస్తుంది..' అంటూ ఏకవచనంతో సంబోధించటంతో ఆయన కన్నీళ్లపర్యంతమయ్యారు.

పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్న మొదట్లో ఆయనతో మర్యాదగానే ప్రవర్తించిన అధికారులు.. ఆ తరువాత రూటు మార్చి రామలింగరాజు తరఫు న్యాయవాదులు రావటానికి ముందే కొన్ని వివరాలు రాబట్టినట్టు తెలియవచ్చింది. ఆకుల రాజయ్యతో రామలింగరాజు కుటుంబీకులు జరిపిన భూక్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి అధికారులు ఎంత ప్రయత్నించినా రామలింగరాజు నుంచి తెలియదనే సమాధానం వచ్చినట్టు తెలిసింది.

తన ఒప్పుకోలు లేఖకు కట్టుబడి ఉంటానని, అంతకు మించి తానేమీ నేరం చేయలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక వడ్లమాని శ్రీనివాస్‌ను విచారించే సమయంలో పరుష వ్యాఖ్యలు ఉపయోగించారు. 'మదుపుదారుల సొమ్ము దారి మళ్లుతుంటే కళ్లు మూసుకున్నావా? నిజంగా నీకు తెలియదంటే నీకంత జీతం ఇవ్వటమే వేస్టు...' అన్నట్టు సమాచారం.

శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో ఉక్కిరిబిక్కిరైన వడ్లమాని ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కొన్ని వివరాలను చివరగా వెల్లడించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలను రామలింగరాజు, వడ్లమాని శ్రీనివాస్‌ల నుంచి నిర్ధారణ చేసుకునేందుకే అధికారులు యత్నించారు.

సత్యం కుంభకోణానికి సంబంధించి సీఐడీ మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌ అడ్వయిజరీ సంస్థ నుంచి అదృశ్యమయ్యాడని భావిస్తున్న డి.గోపాలకృష్ణంరాజును గురువారం రాత్రి 10గంటలకు అరెస్టు చేసినట్లు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొంది.

ఆయనతో పాటు అదుపులోకి తీసుకున్న నర్సింహరాజు, అకౌంట్స్‌ విభాగంలో కీలకవ్యక్తి రామకృష్ణ, ఆడిటింగ్‌ సంస్థకు చెందిన భాస్కర్‌రాజు, అతని కుమారుడు, రోహిణి బయెటెక్‌ ఉద్యోగి ఐవి కృష్టంరాజు, రామలింగరాజు బినామి కంపెనీలకు సంబంధించి ఆనంద్‌ అనే ఉద్యోగిని అధికారులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఐవి కృష్టంరాజును 22వ తేదీ ఉదయం 6గంటలకు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారంటూ.. వారి తరఫు న్యాయవాది స్టీఫెన్‌ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేయాల్సిన వారి జాబితా కూడా సిద్ధమైంది.

అయితే కస్టడీ వ్యవహారం ముగిసేదాకా తదుపరి అరెస్టులకు వెళ్లవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందటంతో ఇన్నాళ్లు ఓపిక పట్టినట్టు తెలిసింది. కాగా పలు బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా రామలింగరాజుకు సహకరించినట్టు సీఐడీ భావిస్తోంది. బ్యాంకర్ల పాత్రను నిర్ధారించుకుని, బ్యాంకింగ్‌ రంగంలో సహకరించినవారిని సైతం అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది.

తీవ్రమైన ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు ఆర్థిక కోణంలో విచారణ చేపట్టారు. సీఐడీ అధికారులు క్రిమినల్‌ కేసుగా పరిగణించి ఐపీసీ ప్రకారం సెక్షన్లు నమోదు చేయటం తెలిసిందే. తమ విచారణ పూర్తవగానే ఎస్‌ఎఫ్‌ఐఓ అధికారులు కేంద్రప్రభుత్వానికి నివేదిక అందచేసి ఆ తరువాత కేసు నమోదు చేసి అరెస్టులు చేయవచ్చని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X