హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులందరికీ ఇళ్ళ స్ధలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: పదవీ విరమణకు ముందే ఇళ్లు కట్టుకోవటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ హామీ ఇచ్చారు. చాలా జిల్లాల్లో ఇప్పటికే స్థలాలు కేటాయించామని, దీనిని త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తింపజేస్తామని తెలిపారు. బుధవారం రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా..సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటుచేసిన అభినందన సభలో వైఎస్‌ ప్రసంగించారు. "పదవీ విరమణ నాటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలం లేకపోవడం సిగ్గుచేటు. ఇది సమాజానికే తలవంపు" అని ఆయన అన్నారు. ప్రజల బాగు కోసం ఉద్యోగులు నిబద్ధత, అంకితభావంతో పనిచేయాలని పిలుపిచ్చారు. "గత ఐదేళ్లలో మంచి పరిపాలన అందించాం. అది మీవల్లే సాధ్యమైంది. అందుకే ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టారు. మీ సహకారంతో మరో పదిహేనేళ్లు పాలిస్తామన్న నమ్మకం కలిగింది. ఈ గెలుపు మీ అందరిది. ఉద్యోగుల అన్ని అవసరాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ఎవరికీ అనుమానాలొద్దు. ఆ దిశగా కృషి చేస్తాం" అని వైఎస్‌ ఉద్యోగులను పొగిడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు చూపించిన ఉత్సాహాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని కోరారు. సచివాలయానికి వచ్చిన అన్ని ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించటానికి సమయంతో నిమిత్తం లేకుండా పనిచేయాలని సూచించారు.

ఉద్యోగుల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ..ఇప్పటికే 22% మధ్యంతర భృతిని ఇచ్చామని, ఆరో వేతన సంఘం సిఫారసులు కూడా అమలు చేస్తామని వెల్లడించారు. నగరంలో తమకు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ ఎం.హనుమంతరెడ్డి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడుతూ..సచివాలయానికి కాగితం వెళితే సమాధానం ఉండదనే ఆరోపణలు రాకుండా, తాత్సారాన్ని వీడిపని చేయాలని ఉద్యోగులకు సూచించారు. సచివాలయ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ హన్మంతరెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలోని 16 ఉద్యోగ సంఘాల తరఫున ఆయా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X