‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా?
చరిత్రను పుస్తకాల ద్వారా మార్చడం కంటే, వెండితెరపై భావోద్వేగాల ద్వారా ప్రజల మనసుల్లో తిరగరాయడం చాలా సులభం. 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో గూఢచారి ఒక అత్యంత ప్రమాదకరమైన 'రిసిన్' విషాన్ని శత్రువుపై ప్రయోగిస్తాడు. సరిగ్గా అదే విధంగా, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ఆలోచనా వ్యవస్థపై ఒక సైకలాజికల్ టూల్‌ను ప్రయోగించాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి తాను చూసింది కేవలం సినిమా అనిపించదు, అదే పరమ సత్యం అనే భ్రమలో చిక్కుకుపోతాడు.
ప్రజల జీవితం అతలాకుతలమైందే
భారత ఆర్థిక చరిత్రలో వివాదాస్పదమైన 'నోట్ల రద్దు' వంటి నిర్ణయాలను ఈ చిత్రం ఒక వీరోచిత విజయంగా అభివర్ణించింది. సామాన్యులు అనుభవించిన అంతులేని ఇబ్బందులను, ఏటీఎంల దగ్గర క్యూల్లో నిలబడి మృతిచెందిన వందలమందిని మరుగున పడేసి, దాని వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రలను అడ్డుకోవడమే అసలు రహస్యమని దర్శకుడు చెప్పారు. ఆయనకెవరు చెప్పారో? పాలకుల ఆర్థిక వైఫల్యాలను 'దేశభక్తి' ముసుగులో విజయాలుగా మార్చే ఈ సినిమాటిక్ క్రియేటివిటీ, ప్రేక్షకుల తార్కిక ఆలోచనా శక్తిని మొద్దుబారుస్తుంది. 140 కోట్ల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేయాల్సిన అవసరం ఏముందనే కనీస లాజిక్, సినిమాటిక్ వెల్లువలో కొట్టుకుపోతుంది.

అసలు సమస్య పక్కదారి
పంజాబ్ యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యను కేవలం సరిహద్దు అవతలి కుట్రగా పరిమితం చేయడం క్షేత్రస్థాయి వాస్తవాలను పక్కదారి పట్టించడమే. వ్యవసాయ రంగం కుంటుపడటం, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి లోతైన అంతర్గత కారణాలను విస్మరించి, బాధ్యతను పూర్తిగా పొరుగు దేశం మీదకు నెట్టేయడం ద్వారా చాలా తేలికగా సమస్యను దృష్టిని మళ్లించారు. అలాగే, దేశంలోని ప్రతిపక్షాలను, వామపక్షాలను, స్వచ్ఛంద సంస్థలను శత్రు దేశపు ఏజెంట్లుగా చిత్రించడం ద్వారా ప్రజాస్వామ్యంలోని విభిన్న భావజాలాల పట్ల సామాన్యుడిలో విషపూరితమైన అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం జరిగింది.
భావోద్వేగపు వెల్లువలో కొట్టుకుపోతాయా?
ఇవన్నీ సినిమా కోసం చేసింది కాదు. పకడ్బందీగా రూపొందించిన ఒక సమాచార యుద్ధం. కళ అనేది సమాజానికి అద్దం పట్టాలి, కానీ ఇక్కడ అద్దం మీద తనకు కావలసిన బొమ్మ గీసి, అదే సమాజం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. ఈ 'రిసిన్' ప్రభావం ఒక్క రోజుతో పోయేది కాదు, ఇది ప్రజల సామాజిక దృక్పథాన్ని, రాజకీయ నిర్ణయాలను దీర్ఘకాలికంగా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగాల వెల్లువలో వాస్తవాలు శాశ్వతంగా సమాధి అయ్యే ప్రమాదం ఈ చిత్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications