హైదరాబాద్: తమది ఆత్మాహుతి దాడులు చేసే సంస్కృతి కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంశాలపై నేతలు ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గుంటూరు సమైక్యాంధ్ర సభలో ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశాడో ఎవరి పైన చేశారో తనకు తెలియదన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియదన్నారు. ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదన్నారు.
తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు ప్రాంతాల నేతలు ఓ మెట్టు దిగాల్సిందే అని అభిప్రాయపడ్డారు. సమస్యను సామస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య ముందు చర్చల వాతావరణం ఏర్పాడలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఢిల్లీ నుండి వచ్చాక చర్చలకు వెళతామన్నారు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు మీడియాకు ఎలా లీకయ్యాయో తనకు తెలియదని మరో నేత గాదె వెంకటరెడ్డి అన్నారు.