హైదరాబాద్: సంగీత దర్శకుడు అనీల్ రెడ్డిది సహజ మరణమే అని ఉస్మానియా వైద్యులు గురువారం తేల్చి చెప్పారు. ఆయన తలకు ఎలాంటి గాయం కాలేదని చెప్పారు. ఆయన గాయాల వల్ల చనిపోలేదన్నారు. రక్తం గడ్డ కట్టడం వల్లే చనిపోయారని చెప్పారు. ఆయనది సహజ మరణం అన్నారు. అనీల్ రెడ్డి మృతదేహంపై పోలీసులకు సాయంత్రం నివేదిక ఇస్తామని చెప్పారు. కాగా గత ఏప్రిల్ 21వ తేదిన అనీల్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అనీల్ మృతి సాధారణమని భావించి ఖననం చేశారు. అయితే ఆ తర్వాత అనీల్ కుటుంబ సభ్యులు సహజ మరణం కాదని ఆయన ప్రియురాలు శాలిని హత్య చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనీల్‌ది సహజ మరణమే అని మూర్చ కారణంగా చనిపోయారని మరోవైపు శాలిని చెబుతోంది.
అనీల్ మరణం తర్వాత ప్రకాశ్ తన వద్దకు పెళ్లి ప్రపోజల్ తెచ్చాడని తాను అంగీకరించక పోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. ఈ నేపథ్యంలో మరోసారి పోస్టుమార్టం చేయాలని అనీల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం పోస్టుమార్టం కోసం వైద్యులు బోయిగూడ శ్మశాన వాటికకు చేరుకున్నారు. అయితే అధికారులు వద్దని చెప్పడంతో ఆ రోజు రీపోస్టుమార్టం ఆపారు. రీపోస్టుమార్టాన్ని అనీల్ కుటుంబ సభ్యులే ఆపారన్న వాదనలు వినిపించాయి. అయితే బుధవారం ఫోరెనిక్స్ నిపుణులు గంట పాటు పోస్టుమార్టం చేశారు. రీపోస్టుమార్టంలో అనీల్‌ది సహజ మరణం అని తేలింది.