హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం వేసిన సభా సంఘాన్ని తాము అంగీకరించేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన సభా సంఘంలో ప్రతిపక్షాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘించి నియమించిన ఈ సభా సంఘాన్ని తాము అంగీకరించబోమని లేఖలో స్పష్టం చేశారు. భూ కేటాయింపులపై విచారణ జరిపేందుకుగాను సభా సంఘాన్ని నియమించిన ప్రక్రియలో నిబంధనలు, సంప్రదాయాలను తుంగలో తొక్కారన్నారు. దానిలో ప్రధాన ప్రతిపక్షానికి తగిన నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం లభించలేదన్నారు.
రాజకీయ పక్షాలను సంప్రదించకుండానే సభ్యులను నియమించడం నిర్ఘాంత పరుస్తోందన్నారు. శాసనసభా పర్వంలోనే ఇది అసాధారణమైన విషయమని ఆయన లేఖలో ధ్వజమెత్తారు. సభా సంఘాల ఏర్పాటు నిబంధనల ఖరారుకు సంబంధించి శాసన సభాపక్ష నేతలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం చెప్పిందని, అయినా అదేమీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను అనుసరించాలని, భూ కేటాయింపులపై ఏర్పాటైన సభాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించాలని, ఆయా పార్టీల బలం ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.