హైదరాబాద్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిందని, ఇక తెలంగాణ తీసుకు వచ్చే బాధ్యత మాదేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. 2014లో బిజెపి తెలంగాణ ఇస్తుందని మహబూబ్‌నగర్ ప్రజలు నమ్మారని, అందుకే తమను గెలిపించాలని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారన్నారు. ఈ తీర్పు తెలంగాణవాదానికి అనుకూలంగా వచ్చిన తీర్పు అన్నారు. తెలంగాణవాదమే గెలిచిందని చెప్పారు. ఈ గెలుపు ఉద్యమానికి నూతన దశను తీసుకు వస్తుందని చెప్పారు. 2009 ఎన్నికల్లో బిజెపి మహబూబ్‌నగర్ నుండి పోటీ చేసి కేవలం 1600 ఓట్లు మాత్రమే సాధించిందన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు మాకు పట్టం కట్టారన్నారు.
జాతీయ పార్టీ ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని మహబూబ్ నగర్ నుండి గెలుపొందిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యమాన్ని బిజెపి బలోపేతం చేస్తుందని చెప్పారు. తెలంగాణవాదం గెలిచిందని, ఈ గెలుపుతో బిజెపి బాధ్యత తెలంగాణ విషయంలో మరింత పెరిగిందన్నారు. తన విజయం తెలంగాణ ప్రజల విజయమని నాగర్ కర్నూలులో గెలుపొందిన నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధిష్టానానికి లేఖ రాయాలన్నారు. టిడిపి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.