న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వం మెడకు మరో కుంభకోణం చుట్టుకుంది. ఇప్పటికే 2జి కుంభకోణం కారణంగా అప్రతిష్టపాలైన యుపిఏకు తాజాగా బొగ్గు గనుల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదిక ఇవ్వడం కొత్త తలనొప్పి తీసుకు వచ్చింది. కాగ్ నివేదికపై ప్రతిపక్షాలు రెండు సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోకసభ స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేసింది. బొగ్గు కుంభకోణం 2జి కంటే పెద్దది అని బిజెపి ఆరోపించింది. దీనిపై వెంటనే ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టింది. కాగా ఇచ్చిన నివేదిక పాతది అని ప్రభుత్వం చెప్పింది. ఈ అంశంపై గనుల శాఖ మంత్రి జైశ్వాల్ సమాధానం ఇస్తారని చెప్పింది. అయితే కాగ్ నివేదికను తాను పరిశీలించలేనని, ఇప్పుడే తాను దీనిపై ఏమీ మాట్లాడనని సదరు మంత్రి చెప్పారు. కాగా అవకతవకలు జరిగిన సమయంలో బొగ్గు శాఖ ప్రధాని వద్దే ఉంది. దీంతో ప్రధాని వివరణ ఇవ్వాలని బిజెపి, లెఫ్ట్ పార్టీలు పట్టుబట్టాయి. యుపిఏ దేశాన్ని పూర్తిగా లూటీ చేస్తోందని, మేము దీనిని జరగనివ్వమని, ఈ అంశంపై మేం నోటీసులు ఇస్తామని బిజెపి చెప్పింది. యుపిఏ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వమని లెఫ్ట్ విమర్శించింది.
కాగా 2004 - 2009 కాలంలో బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొందని సమాచారం. వేలం వేయకుండానే నామినేషన్‌పై బొగ్గు గనుల కేటాయింపులు కేంద్రం జరిపిందని తెలిపిందని సమాచారం. ఈ కుంభకోణంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధముందని నివేదికలో పేర్కొంది. రూ.10.67 లక్షల కోట్ల మేర అవకవతకలు జరిగాయని తెలిపింది. దేశంలోని ప్రతిష్టాత్మక కంపెనీలు అన్నింటినీ కాగ్ తన నివేదికలో పేర్కొంది. అధానీ, మిట్టల్ గ్రూప్, టాటా, జిందాల్, వేధాంత, అదిత్య బిర్లా, ఎస్ఆర్ గ్రూప్ తదితర కంపెనీల పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2004-09 మధ్య కాలంలో 155 బొగ్గు గనులను కేంద్రం ఎలాంటి వేలం వేయకుండానే కేటాయించిందని ఆరోపించింది. కాగా బొగ్గు తదితర నేచరల్ రిసోర్సెస్ కేటాయింపులు వేలం ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పింది.