హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు ఆమోస్, యాదవ రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా రాజీనామాలు చేస్తే అధిష్ఠానం దిగివచ్చి తక్షణమే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదా? అని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరు శనివారం కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో తెలంగాణ కోసం మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి గొంతు మార్చారని విమర్శించారు. తెలంగాణ వాదం తగ్గిందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని విమర్శించారు. తెలంగాణ వాదం తగ్గిందని గండ్ర ఎలా అంచనా వేశారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లేదని ప్రకటించి 2014 ఎన్నికల్లో గెలవగలరా అని నిలదీశారు. అధిష్ఠానానికి వాస్తవాలు చెప్పే ధైర్యం లేకపోతే మంత్రి పదవులనుంచి తప్పుకోవాలన్నారు. తెలంగాణ రాకపోవడానికి ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో విభజనే ప్రధాన కారణమని అన్నారు.
పదవుల ప్రలోభాన్ని వీడి ఒక గంటయినా ఐక్యంగా ఉంటే తెలంగాణ వస్తుందని ఉద్ఘాటించారు. తాజా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మేధోమథనం జరగాలన్న సీనియర్లను తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఎందుకు నమ్మడం లేదన్న విషయమై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు ప్రత్యేక రాష్ట్ర కాంక్షపై ముఖ్యమంత్రితో మాట్లాడి అధిష్ఠానానికి వాస్తవాలు వెల్లడించే ధైర్యం ఉందా అని, సీనియర్ల వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతోందంటున్న మంత్రులు గతంలో తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పలు సమావేశాలకు హాజరై తెలంగాణపై గట్టిగా మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల మాటలపై నమ్మకం లేకనే పార్టీ అభ్యర్థులను ఓడించారని అన్నారు. మంత్రుల వెనుకంజ వల్లే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు.