ఏలూరు/హైదరాబాద్: తిరుపతి సహా అన్ని ఉప ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య గురువారం అన్నారు. ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతాయని చెప్పారు. ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కూడా పార్టీలో చేరతారని హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. కాగా హరిరామజోగయ్య త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు జూలై తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలడం ఖాయమని గోనె ప్రకాశ రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. వచ్చే పద్దెనిమిది నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అనంతపురం జిల్లా నేత విశ్వేశ్వర రెడ్డి అన్నారు. టిడిపికి మూడో స్థానమే అన్నారు.