దయతలిస్తే త్వరలోనే చిరంజీవి సిఎం: రామచంద్రయ్య

గత కొన్ని రోజులుగా సి.రామచంద్రయ్యతో పాటు మరో మంత్రి గంటా శ్రీనివాస రావు చిరంజీవి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్న విషయం తెలిసిందే. బుధవారం గంటా శ్రీనివాస రావు విశాఖపట్నం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. చిరంజీవి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఆయనను విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి ప్రజల మనిషి అని, ఆయన ప్రజల నుండి వచ్చిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని, చిరంజీవి సిఎం అవుతారని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని గంటా శ్రీనివాస రావు చెప్పారు.
అంతకుముందు కూడా తమ చిరంజీవి విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య శనివారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. అయితే, నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఆ విషయం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆయన శనివారం కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల అభీష్టం త్వరలో నెరవేరుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications