
దాసరిపై ఆలస్యంగా కేసు: బిజెపి, బృందాలుగా సోదాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు పైన పదిహేను నెలలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదయిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం విచారణ జాప్యం అయిందన్నారు. ఈ కుంభకోణంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయాలన్నారు.
మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్‌ల పైన పదిహేను నెలలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. ఈ కేసు నుండి ప్రధాని ఎట్టి పరిస్థితుల్లోను తప్పించుకోలేరన్నారు. కాంగ్రెసు దేశ సంపదను లూటీ చేసిందని ఆరోపించారు. తాము ప్రస్తుత సంక్షోభం నుండి(అద్వానీ రాజీనామా అంశం) గట్టెక్కుతామని, మరింత బలపడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న సోదాలు
బొగ్గు కుంభకోణం కేసులో హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోని పలు ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాదులోని దాసరి నారాయణ రావు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ కేసులో నిందితుల అరెస్టు పైన ప్రశ్నిస్తే సిబిఐ నో కామెంట్ అని చెబుతోంది. రెండు బృందాలుగా విడిపోయిన సిబిఐ దాసరి ఇంట్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో దాదాపు 20 మంది వరకు పాల్గొన్నారు. సోదాల సమయంలో ఎవరిని లోపలకు అనుమతించలేదు. దాసరి వాహనాలను తనిఖీ చేశారు. దాసరిని మరోసారి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.