ప్రేమజంటపై కారుతో ఢీ: పరీక్ష రాసి వస్తుండగా అటాక్.. తీవ్ర గాయాలు..
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 15 నెలలు కలిసి ఉన్నారు. అయితే కుటుంబసభ్యులు విడదీశారు. విడాకులు కూడా ఇప్పించారు. కానీ వారు మనుషులు విడిపోయారు కానీ.. మనసులు కాదు. రోజూ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో పరీక్ష వచ్చింది. వారిద్దరూ కలిసి.. అలా బైక్‌పై వస్తోండగా.. కుటుంబసభ్యులు చూశారు. కారుతో ఢీ కొట్టారు. అచ్చం సినిమా కథలా ఉన్న ఇదీ యధార్త గాధ. నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

ప్రేమించి పెళ్లి.. విడాకులు కూడా
నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నాగజ్యోతి, అక్షయ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2019 మే 28వ తేదీన పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. 15 నెలలు కలిసి ఉన్నారు. అయితే ఇటీవల కుటుంబ సభ్యులతో మాటలు కలిశాయి. తల్లికి బాగోలేదని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. నచ్చని పెళ్లి చేసుకున్నావని.. విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. లేదంటే అక్షయ్‌ను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఆమె విడాకుల పేపర్ మీద సంతకం చేశారు. వారిద్దరూ విడిపోయారు. కానీ మాటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

పరీక్ష రాశాక.. కలిస్తే..
డిగ్రీ పరీక్షలు వచ్చాయి. కుంటాల మండలం కల్లూరు వాసవీ కాలేజీలో పరీక్ష రాసేందుకు నాగజ్యోతి వచ్చారు. పరీక్ష రాసిన తర్వాత అక్షయ్ కలిశారు. ఇద్దరూ కలిసి టూ వీలర్‌పై వెళుతున్నారు. వారిని వెంబడిస్తున్న నాగజ్యోతి సోదరులు.. కారుతో ఢీ కొట్టారు. దీంతో నాగజ్యోతికి తీవ్రంగా గాయపడ్డారు. అక్షయ్‌పై దాడి చేయడంతో అతను గాయపడ్డారు. వీరిద్దరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్టు బైంసా గ్రామీణ పోలీసులు తెలిపారు.

ప్రేమించడమే తప్పు..?
ప్రేమించడమే తాము చేసిన తప్పా అని కపుల్స్ అంటున్నారు. తమ మీద ఎందుకు ఇంత కక్షకట్టారో అర్థం కావడం లేదన్నారు. ప్రజాసంఘాలు వారికి అండగా నిలిచాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నాయి. స్థానికంగా మాత్రం ఈ ఘటన కలకలం రేపింది.