సిగ్గుందా, ఫినిష్ అవుతారు: చంద్రబాబు హెచ్చరిక, షాకిచ్చిన బీజేపీ మహిళా కార్యకర్త
అమరావతి: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు, అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ దాదాపు ముప్పై మందికి పైగా బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనను వారు అఢ్డుకోవడంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ వద్ద ఈ సంఘటన జరిగింది. బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‍కు అడ్డుపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని వారికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.

సిగ్గుందా అంటూ బీజేపీపై మండిపాటు
బీజేపీ కార్యకర్తలు.. గో బ్యాక్ ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు కొంచెమైనా సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఏపీ విషయంలో చిత్తశుద్ధి ఉందా అన్నారు. మీ నరేంద్ర మోడీ గురించి చెబితే మీరు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి మోడీ అన్నారు.
జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!

పెట్టుకుంటే ఫినిష్ అవుతారు
సీఎం డౌన్.. డౌన్ అని వారు అంటుంటే.. చంద్రబాబు స్పందిస్తూ.. డౌన్ డౌన్ కాదని, మిమ్మల్ని ప్రజలు కొడతారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. లేనిపోని ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టుకోవద్దని, పెట్టుకుంటే మీరు ఫినిష్ అవుతారని హెచ్చరించారు. మీరు ఈ గడ్డ పైన ఉన్నారని, మీ నరేంద్ర మోడీ ఏం చేశారని అడిగారు. ఓ బీజేపీ మహిళను ఉద్దేశించి.. ఏం చేశారమ్మా మీ మోడీ అని చంద్రబాబు ప్రశ్నించారు. దానికి ఆమె కూడా ఘాటుగానే స్పందించారు. ఏపీకి ఎంతో చేశాడన్నారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. ఆ చేశాడమ్మా, ముంచేశారని అన్నారు. దానికి ఆ బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ఎవరిని ముంచారని నిలదీశారు. చంద్రబాబు స్పందిస్తూ.. రాష్ట్రాన్ని, దేశాన్ని ముంచారన్నారు.

అలా చేస్తే అభినందిస్తా
బయటకు వస్తే ప్రజలను మిమ్మల్ని వదిలి పెట్టరని, మర్యాదగా ఉండాలని చంద్రబాబు.. సదరు బీజేపీ మహిళా కార్యకర్తకు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో నిన్న కూడా లాఠీఛార్జ్ చేశారని, మీకు ఏమైనా ఉందా, ఈ రాష్ట్రం నీళ్లు తాగుతున్నారన్నారు. మన రాష్ట్రం అని ఉందా అన్నారు. దానికి సదరు బీజేపీ మహిళా కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మనం ఏపీ వాళ్లమని కొంచెమైనా ఉందా, వెళ్లవమ్మా.. వెళ్లు అన్నారు. మనకు రావాల్సిన నిధుల కోసం పోరాడితే నేను అభినందిస్తానని చెప్పారు.