నటించడం సీఎం జగన్‌కు రాదు, ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తున్నాం: కన్నబాబు
ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని ప్రభుత్వం నేరవేరుస్తోందని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. రైతులకు చెప్పిన ప్రతీ ఒక్క హామీని నెరవేర్చామని తెలిపారు. సీఎం జగన్‌కు నటించడం చేత కాదన్నారు. అన్నీ చేతల్లో చూపిస్తారని కొనియాడారు. రైతు పక్షపాతి అని జగన్ నిరూపించుకున్నారని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు సోమవారం వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు ప్రసంగించారు.

పంటల కొనుగోలు కోసం..
పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు కేటాయించామని మంత్రి కన్నబాబు వివరించారు. రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సహకార రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదన్నారు. వరదల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని.. డిసెంబర్ నెలాఖరు కల్లా బాధితులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు.

రంగుమారిన ధాన్యం కూడా..
రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు. సీఎం జగన్ స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారని తెలిపారు. ఏరియల్ సర్వేలను గాలి సర్వేలని చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన సర్వేలను ఏమనాలి అని.. హుద్‌హుద్ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులిచ్చారని విరుచుకుపడ్డారు. నటించడం జగన్‌కు తెలియదన్నారు.

ఏ సీజన్ ఆ సీజన్‌కే..
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌లో పరిహారం ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. ఉచిత పంట బీమాను అమలు చేస్తున్నామని... ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు ఉచిత పంటల బీమా వర్తిస్తోందని చెప్పారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.11,981 కోట్లు వేశామని చెప్పారు. ఏడాదిన్నరలో రైతుల ఖాతాల్లో రూ.13,463 కోట్లు వేశామన్నారు.

పొగాకు రైతుల కోసం రూ.120 కోట్లు
పొగాకు రైతులను ఆదుకునేందుకు రూ.120 కోట్లతో కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సహకార చక్కెర కర్మాగారాలను చంద్రబాబు అమ్మేశారని.. కానీ తాము చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం సబ్‌కమిటీ వేశామని చెప్పారు. కరోనా సమయంలో ధరలు పడిపోయిన అరటి, బత్తాయి పంటలను కొన్నామని వివరించారు.