పవన్ కల్యాణ్ వారాహి ప్రారంభంలో కీలక మార్పు: వివరాలివే..
పవన్ కల్యాణ్ వారాహి బస్సు ప్రారంభ కార్యక్రమంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు అనుకున్న విధంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దీన్ని ప్రారంభించట్లేదు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. ఎన్నిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనేది ఇందులో ఖరారు చేస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తాయి. అందుకే దీన్ని కీలకంగా భావిస్తోంది జగన్ ప్రభుత్వం.

వారాహి వాహనంలో..
అదే రోజున జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహించనుంది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ. దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఆవిర్భావ సభ పోస్టర్ కూడా ఇదివరకే ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ సభకు సన్నాహకంగా జనసేన పార్టీ- పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

స్వల్పంగా మార్పు..
ఈ పరిణామాల మధ్య- మంగళవారం నాటి పవన్ కల్యాణ్ కార్యక్రమాల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్ కు అనుగుణంగా ఇది ఉండట్లేదు. స్వల్పంగా మార్పులు చేశారు. పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మచిలీపట్నానికి బయలుదేరాల్సి ఉంది. మార్గమధ్యలో ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో జన సైనికులు ఆయనకు ఘన స్వాగతం పలికేలా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.

విజయవాడ నుంచి..
తాజాగా ఇందులో మార్పులు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారు. ఈ మార్పు చేయడానికి కారణం లేకపోలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో- మంగళగిరి నుంచి వారాహి వాహనాన్ని ప్రారంభించాల్సి వస్తే శాసన సభకు వచ్చే మంత్రులు, సభ్యులకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో- దీన్ని విజయవాడ ఆటోనగర్ కు మార్చారు.

పోలీసుల విజ్ఞప్తికి..
ఈ మేరకు పోలీసులు చేసిన విజ్ఞప్తికి తాము సానుకూలంగా స్పందించామంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదు. నిర్దేశించిన ప్రాంతాల్లో జనసైనికులు ఆయనకు స్వాగతం పలుకుతారని వివరించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారని అన్నారు.












Click it and Unblock the Notifications