ఎండలోనే వారి కోసం .. నేలపై కూర్చుని నిరసనకారుల సమస్యలు విన్న సబ్ కలెక్టర్ , ప్రశంసల జల్లు
ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా, ఫిర్యాదులు చేసినా, ఆఫీసుల ముందు ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులు ఎంతోమంది ఉన్నారు. కానీ అనంతపురం జిల్లాలో ఓ అధికారి ప్రజల సమస్యలను పట్టించుకోవడమే కాదు, ఏకంగా వారి కోసం మండుటెండలో నేల పైన కూర్చుని సమస్యలు విన్నారు. అనంతపురం సబ్ కలెక్టర్ ప్రజల సమస్యలు వినడానికి చేసిన పని ఇప్పుడు అందరూ హ్యాట్సాఫ్ చెప్పేలా చేస్తోంది.
పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన
అసలేం జరిగిందంటే అనంతపురం జిల్లా, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్ కార్యాలయం ముందు సోమందేపల్లి మండలం లోని నక్కలగుట్ట లోని ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నాయకులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నక్కలగుట్ట లోని ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించే దాకా అక్కడ నుండి కదిలేది లేదని వారంతా ఆందోళన చేస్తూ అక్కడే కూర్చున్నారు. సబ్ కలెక్టర్ బయటకు వచ్చి సమస్య పరిష్కరించాలని, నక్కలగుట్ట లో పోలీస్ పికెటింగ్ తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

సబ్ కలెక్టర్ నేలపై కూర్చుని ఆందోళనకారులతో చర్చలు
ఇక దీంతో ఆఫీసులో ఉన్న సబ్ కలెక్టర్ నవీన్ ఆందోళనకారుల వద్దకు వచ్చే ఆశ్చర్యపరిచారు. నేలపై బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల వద్ద ఆయన కూడా నేల పైన కూర్చుని వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఎండలోనే ఆందోళనకారుల ఎదుట నేలపై 15 నిమిషాలకు పైగా కూర్చుని వారితో మాట్లాడారు. రెండు రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని సబ్ కలెక్టర్ నవీన్ ఆందోళనకారులతో చెప్పారు. దీంతో ఆందోళనకారులు ఆందోళనను విరమించారు. సబ్ కలెక్టర్ నవీన్ తీసుకున్న చొరవను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
అధికారులంటే ఇలా ఉండాలంటూ పెనుగొండ సబ్ కలెక్టర్ కు కితాబు
ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రజల సమస్యలు పట్టించుకోని అధికారులు ఉన్న నేటి కాలంలో ప్రజల సమస్యలు వినడానికి ప్రజలతో పాటు ఎండలో నేలపై కూర్చున్న సబ్ కలెక్టర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అర్థం చేసుకుని పరిష్కరించే వారే కదా అధికారులంటే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్ స్కూల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో ఇస్తున్న భోజనం నాణ్యతను ఆయన స్వయంగా తిని పరిశీలించారు.
ఇటీవల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసినవిశాఖ కలెక్టర్
విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసిన కలెక్టర్ పాఠశాలల్లో పరిస్థితులను సమీక్షించారు. చోడవరం మండలంలో పర్యటించిన కలెక్టర్ మల్లికార్జున చోడవరం కొత్తూరు జంక్షన్లో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి నాడు-నేడు పనులను పరిశీలించటమే కాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు. ఉన్నతాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకోవటానికి క్షేత్ర స్థాయిలో సామాన్యుల్లో సామాన్యులుగా మారితే అలాంటి వారిని అందరూ గుర్తుంచుకుంటారు. వారి సమస్యను వారి కోణం నుండి విన్నప్పుడే, అర్ధం చేసుకోగలిగినప్పుడే వారి కోసం స్థాయితో సంబంధం లేకుండా పని చెయ్యగలిగినప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాంటి వారు ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉంటారు.












Click it and Unblock the Notifications