విశాఖే ఆర్ధిక రాజధాని- రూ.1400 కోట్లకు ఫైనాన్స్ కమిషన్ ఓకే-అమరావతికి మరో షాక్
ఏపీకి నిన్న పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిన నేపథ్యంలో 15వ ఆర్ధిక సంఘం చేసిన ఓ ప్రతిపాదన మాత్రం ఊరటనిచ్చింది. హైదరాబాద్‌కు రాజధాని కోల్పోయిన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రూ.1400 కోట్లు కేటాయిస్తూ ఆర్ధికసంఘం తీసుకున్న నిర్ణయం ఏపీతో పాటు వైసీపీ సర్కారుకూ కాస్త ఊరటనిచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటివరకూ టీడీపీ చెబుతున్న అమరావతి ఆర్ధిక రాజధాని అంశాన్ని పక్కనబెట్టి భవిష్యత్తులో ఆర్ధికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నగరంగా విశాఖకు ఈ మొత్తం కేటాయిస్తున్నట్లు ఆర్ధిక సంఘం చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.

ఏపీకి నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్
కేంద్రంతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న సఖ్యత నేపథ్యంలో నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కాస్తో కూస్తో ఊరటదక్కుతుందని భావించిన వారందరికీ నిరాశ తప్పలేదు. ముఖ్యంగా అధికార వైసీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా బడ్డెట్‌పై పెదవి విరిచాయి. అలాగే నిఫుణులు కూడా బడ్జెట్ మోసాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఏపీకి ఎప్పటిలాగే కేంద్రం మొండిచేయి చూపిందని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కరోనా వ్యాక్సిన్, రెండు రైల్వే ఫ్రైట్ కారిడార్లు మినహా ఇందులో ఏపీకి దక్కిందేమీ లేదు.

విశాఖకు ఫైనాన్స్ కమిషన్ గుడ్‌న్యూస్
కేంద్ర బడ్జెట్ వెలువడ్డాక నిరాశలో ఉన్న వైసీపీ సర్కారుకు 15వ ఆర్ధిక సంఘం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం కాస్త ఊరట కలిగించింది. ఇప్పటివరకూ రాజధానిగా ఉన్న అమరావతిని గ్రోత్ కారిడార్‌గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతుండగా.. దీనికి విరుద్ధంగా విశాఖను ఆర్ధిక రాజధానిగా గుర్తించేలా వైసీపీ సర్కారు చేసిన ప్రతిపాదనల్ని 15వ ఆర్ధిక సంఘం ఆమోదించింది. హైదరాబాద్ కోల్పోవడం కారణంగా నష్టపోయిన మొత్తాన్ని భర్తీ చేసుకునేందుకు వీలుగా ఆర్ధిక నగరం నిర్మాణం కోసం విశాఖకు రూ.1400 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక సంఘం ప్రకటించింది. దీంతో వైసీపీ సర్కారు విశాఖకు నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లయింది.

అమరావతి కాదు విశాఖే ఆర్ధిక నగరం
గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిలో పలు జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులు రప్పించేందుకు ప్రయత్నించగా.. ఇప్పుడు వైసీపీ సర్కారు దానికి భిన్నంగా విశాఖపై దృష్టిసారించింది. ఈ సాగర నగరం ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు పలు అవకాశాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ అందుకు తగినట్లుగానే నిధులు కేటాయించాలని ఆర్ధిక సంఘాన్ని, కేంద్రాన్ని కోరింది. దీనికి స్పందనగా ఇప్పుడు రూ.1400 కోట్ల నిధులను వచ్చే ఐదేళ్లలో కేటాయించేందుకు ఆర్ధిక సంఘం అంగీకరించింది. ఆర్ధిక కార్యకలాపాలతో పాటు ఇతర మౌలిక అవసరాల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.

అమరావతికి ఫైనాన్స్ కమిషన్ షాక్
గతంలో అమరావతిలో పలు ప్రాజెక్టుల కోసం 14వ ఆర్ధిక సంఘం నిధుల కోసం గత టీడీపీ సర్కారు ప్రయత్నించింది. కొన్ని నిధులను కూడా రాబట్టుకోగలిగింది. అయితే 15వ ఆర్ధిక సంఘం మాత్రం వైసీపీ సర్కారు ప్రతిపాదనల మేరకు విశాఖకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు లేక కేంద్రం, ఆర్ధిక సంఘం కూడా పట్టించుకోక అమరావతి కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిలిచిపోగా.. ఆర్ధిక సంఘం నిర్ణయంతో విశాఖవైపే ఆర్ధిక రంగం పరుగులు తీయడం ఖాయంగా మారుతోంది.