2024 ఏపీ ఎన్నికలు: తోడేళ్ళ ముఠా వర్సెస్ సింహం!!
టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటన చేసిన విషయం కూడా తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా వైసీపీ ని ఓడించటం సాధ్యం కాదని, అందుకే టీడీపీతో పాటు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక నుండి వైసీపీ సర్కార్ పై యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీలో 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించే రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చంద్రబాబు అరెస్ట్ అయ్యిన నాటి నుండి అనేక పరిణామాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు టిడిపి వర్సెస్ వైఎస్ఆర్సిపి అని పేర్కొన్న ఆయన రానున్న ఎన్నికలను తోడేళ్ల ముఠాకు సింహానికి మధ్య జరుగుతున్న పోరాటంతో పోల్చవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం దురాశ వర్సెస్ ప్రజా సంక్షేమం మధ్య జరగనున్న పోరుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఏపీలో యూటర్న్ రాజకీయాలకు మరియు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న సమరంగా 2024 ఎన్నికలను ఆయన పోల్చారు. అస్థిరతకు మరియు స్థిరత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా వచ్చే ఎన్నికలు ఉండబోతున్నాయి అన్నారు.
అవకాశవాదానికి నిజాయితీకి మధ్య జరుగుతున్న పోరాటమని, కుల రాజకీయాలకు మరియు ఐక్యతకు మధ్య జరుగుతున్న సమరం అని, క్రోనీ క్యాపిటలిజానికి, అందరికీ ప్రయోజనం చేకూర్చడానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఇది మొత్తంగా ప్రతిపక్షం వర్సెస్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రజలకు జరుగుతున్న సంగ్రామం అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభివర్ణించారు.












Click it and Unblock the Notifications