కృష్ణాజిల్లాలో పునరావాస శిబిరానికి వెళ్తున్న బోటు గల్లంతు.. ఘటన సమయంలో బోటులో 8మంది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఏపీలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణ నదికి ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం గేట్లను పైకెత్తడంతో భారీగా వరద నీరు దిగువకు వెళుతుంది. దీంతో కృష్ణ పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలలో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావస కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించి వారికి భరోసా ఇస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరదల ముంపుకు గురైన ప్రాంతాలలో ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి.

పునరావాస శిబిరానికి వెళ్తున్న బోటు బోల్తా.. వారి ఆచూకీ కోసం గాలింపు
తాజాగా కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పునరావాస శిబిరానికి వస్తున్న బోటు గల్లంతైంది. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బోటు ప్రమాదానికి గురైన సమయంలో బోటులో 8 మంది ఉన్నారని సమాచారం. వీరిలో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా, ఇంకో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యలకు ప్రత్యేకాధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
భారీ వర్షాలు వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉంటూ వీరు పునరావస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు వరదలు నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఇప్పటికే 8 ఎన్ డి ఆర్ ఎఫ్ 10 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
సహాయక చర్యల్లో హెలికాఫ్టర్ లు
వాయు మార్గం ద్వారా కూడా సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనకు గురికా వద్దని, విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ తెలిపారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న క్రమంలో వాటిపైన వెళ్ళే సాహసాలు చేయకూడదని, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications